సినీవినోదం రేటింగ్ :2.25/5
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో దిల్‌రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంజు (రామ్)ది కాకినాడ. సొంతూరులో తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా వుండటం తప్ప అతడికి పెద్దగా లక్ష్యాలు లేవు. మావయ్య (పోసాని)తో మాట్లాడిన తరవాత అతడిలో మార్పు వస్తుంది. తను ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారని తెలుసుకుని ..హైదరాబాద్ ట్రయిన్ ఎక్కుతాడు. రైల్వే స్టేషన్లో కాకినాడ కుర్రాళ్లను తక్కువచేసి మాట్లాడిన అనుపమ (అనుపమ పరమేశ్వరన్)ను భయపెడతాడు. హైదరాబాద్ చేరాక ఆ అమ్మాయి, తన తల్లి స్నేహితుడు విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) కూతురు అని తెలుస్తుంది. సంజు కూడా వాళ్ళింట్లో వుండవలసి వస్తుంది. ట్రయిన్లో చేసిన పనికి సారీ చెప్పి అనుపమతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆఫీసులో రీతు (ప్రణీత)ను ప్రేమిస్తున్నాని అనుకుంటాడు. రీతు లవ్ ప్రపోజ్ చేసే టైమ్‌లో అనుపమను లవ్ చేస్తున్నానని సంజు తెలుసుకుంటాడు. అనుపమతో సంజు ఫ్రెండ్షిప్ లవ్‌గా ఎప్పుడు మారింది? ఆ ప్రేమ సంగతి తెలిసిన విశ్వనాథ్ ఏం చేశాడు? సంజు ప్రేమను అనుపమ అంగీకరించిందా? అనేది సినిమాలో చూడాలి…
‘సినిమా చూపిస్త మామ’, ‘నేను లోకల్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరో గా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొటీన్ స్టోరీ … ఆలోచనలో వున్నంత కొత్తదనం కథలో, సినిమాలో లేదు. కానీ, కామెడీ మాత్రం వున్నంతలో వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్ సరదాగా వెళ్తుంది. సినిమా ఊహించిన విధంగా ఉండడంతో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆసక్తికరంగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో రామ్ , ప్రకాష్ రాజ్ పాత్రల పైనే ఫోకస్ పెట్టడంతో.. హీరోయిన్ పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. ఇక రామ్ -ప్రణీత లవ్ ట్రాక్ కూడా సినిమాకు మరో మైనస్ అయ్యింది. రామ్ – అనుపమ ల మధ్య వచ్చే లవ్ సన్నివేశాలను కూడా ఇంకొంచెం ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. సరైన లవ్ ట్రాక్ కూడా లేకపోవడం..రొటీన్ టేకింగ్..కొన్ని బోరింగ్ సన్నివేశాలు.. పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం..కామెడీపై పెట్టినంత శ్రద్ధ ఎమోషనల్ సన్నివేశాలపై పెట్టకపోవడం..ఈ సినిమాకు మైనస్ .కూతురుని పడేయటానికి తండ్రినే సహాయం అడగటం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మరీ తేల్చేసినట్టు కాకుండా ఇంకాస్త బలంగా చేస్తే బాగుండేది.
ప్రకాశ్ రాజ్, రామ్‌ల నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది.కామెడీ టైమింగ్‌లోనూ రామ్, ప్రకాష్ రాజ్‌లు ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ పాత్రలతో పాటు ప్రేక్షకుల్ని నవ్వించే పాత్రలు బాగా చేయగలనని మరోసారి గుర్తు చేశారు.ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన డైలాగులు, కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. రామ్ ఎప్పటిలా హుషారుగా నటించాడు. అనుపమ పాత్ర మేరకు చేసింది. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు, హీరో హీరోయిన్ తండ్రి మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. ప్రణీత నాలుగు సన్నివేశాలు, ఓ పాటలో సందడి చేసింది. జయప్రకాష్, సితార, ఆమని, పోసాని కృష్ణమురళీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈచిత్రంలో లేదు. రామ్ గత చిత్రాలకు మంచి ఆడియో అందించిన దేవి ఈ చిత్రం లో నిరాశ పరిచాడు. నేపథ్య సంగీతం ఓకే. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం సినిమాకు కలర్‌ఫుల్ లుక్ తీసుకువచ్చింది -రాజేష్