“ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వెళ్లే సంస్కృతి అంతరించే అవకాశాలు ఉన్నాయ”ని .. ‘Wonder Woman’ సినిమా డైరక్టర్ ప్యాటీ జెన్కిన్స్ హెచ్చరించారు. కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ అయిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ సినీ థియేటర్లు మూసివేత కారణంగా.. హాలీవుడ్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వండర్ వుమెన్’ సినిమా డైరక్టర్ ప్యాటీ జెన్కిన్స్ ఈ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వెళ్లే సంస్కృతి అంతరించే అవకాశాలు ఉన్నట్లు ఆమె హెచ్చరించారు. కరోనా మహమ్మారి వల్ల జెన్కిన్స్ రూపొందించిన ‘Wonder Woman 1984’ సినిమా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. సినిమాలకు ఆర్థిక సాయం చేయాలంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది. “మనం ఇలాగే సినిమాహాళ్లను మూసివేస్తే.. ఈ పరిస్థితి లో ఏమీ మార్పు రాదు” అని ఆమె అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సినిమాకు వెళ్లే సంస్కృతిని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లు సోషల్ డిస్టాన్సింగ్ నిబంధన వల్ల విలవిలలాడుతున్నాయి. దీంతో భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. అమెరికాలో సుమారు 69 శాతం చిన్న, మధ్య తరహా సినిమా కంపెనీలు దివాళా తీసే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ ‘థియేటర్ల సంఘం’ ఆవేదన వ్యక్తం చేసింది. బాక్సాఫీసు రెవెన్యూ అంశంలో అమెరికా మూవీ మార్కెట్ చాలా పెద్దది. ఆ తర్వాత స్థానంలో చైనా, భారత్ ఉన్నాయి. సినిమా థియేటర్లను మూసివేయడం వల్ల.. హాలీవుడ్ స్టూడియోలు పెట్టుబడులు ఆపేస్తాయని జెన్కిన్స్ ఆరోపించారు. దీంతో ఆన్లైన్ OTT పై అందరికీ ఆసక్తి పెరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మ్యూజిక్ పరిశ్రమకు ఇలాంటి షాకే తగిలిందని, ఇప్పుడు సినీ ఇండస్ట్రీనే కష్టాల బాట పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.
ఈ మధ్య రిలీజ్ కావాల్సిన కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాలు OTT ఆన్లైన్లో రిలీజ్ అయ్యాయి. వాల్ట్ డిస్నీ రూపొందించిన ‘ములన్’ ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అయితే వండర్ వుమెన్‌కు సీక్వెల్‌గా తాను తీసిన ‘వండర్ వుమెన్ 1984’ సినిమాకు కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె భయాందోళనలు వ్యక్తం చేశారు. జూన్‌లో రిలీజ్ కావాల్సిన ఆ సినిమాను క్రిస్టమస్ డేకు వాయిదా వేశారు. కొత్త జేమ్స్‌బాండ్ సినిమా ‘నో టైమ్ టుడై’ రిలీజ్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు గత వారమే ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఆ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ‘ద బ్యాట్‌మ్యాన్’ రిలీజ్‌ను కూడా మార్చి 2022కి వార్నర్ బ్రదర్స్ వాయిదా వేశారు.