వివేక్ విశాల్, తరుణికాసింగ్, యామిని నాయకానాయికలుగా వై.వై.వి క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మూర్తి వన్నెంరెడ్డి నిర్మిస్తోన్న `యు` అనే చిత్రం గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకులు వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియా సమావేశంలో…
చిత్ర దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ… ` దర్శకుడిని కాకముందు కొన్ని డెమోస్ తీసాను. అందులో `కాలజ్ఞానం` అనేది ఒకటి. న్యూయార్క్, బాంబే తదితర ప్రదేశాల్లో ఈ డెమో ప్రదర్శన జరిగింది. ఇప్పుడిదే డెమోను పూర్తి కథతో సినిమాగా చేస్తున్నా. మనిషి సృష్టించుకుంటోన్న అభివృద్దే వినాశనానికి కారణమని చెప్పబోతున్నా. పంచభూతాలు మాట్లాడవు? కానీ ధర్మాన్ని పాటిస్తాయి. మనిషి ఎక్కువగా మాట్లాడుతాడు. కానీ ధర్మాన్ని పాటించడు. ఈ అంశాలను హైలైట్ చేస్తూ తీయబోతున్నా. ఇదొక యూనిక్ సబ్జెక్ట్.ఈ చిత్రానికి మూర్తి వన్నెంరెడ్డి మంచి నిర్మాత కుదిరారు. ఆయనకు పరిశ్రమలో 25 ఏళ్ల పాటు అనుభవం ఉంది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు.
చిత్ర నిర్మాత మారుతి వన్నెంరెడ్డి ,` నిర్మాత కాకముందు రామానాయుడు స్టూడియో, శబ్ధాలయ స్టూడియోస్ లో పనిచేసా. ఇండస్ర్టీలో 25 ఏళ్ల నుంచి ఉంటున్నా. ఇప్పుడీ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మంచి కథ ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తా. వైజాగ్, అరకు, పాడేరు ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేస్తాం` అని అన్నారు.
హీరో వివేక్ విశాల్ మాట్లాడుతూ, `యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది. కథ చాలా బాగా వచ్చింది. సినిమా కూడా అంతే బాగా వస్తుంది. మంచి టీమ్ కుదిరింది` అని అన్నారు. సినిమాలో అవకాశం పట్ల హీరో, హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వద్, కో-డైరెక్టర్- శంకర్ నిమ్మన.