విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా ‘ఇది నా బయోపిక్’. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు జీవా క్లాప్ ఇవ్వగా, టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ నాయకులు మెట్ట సూర్యప్రకాష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ… “ఇదొక క్రైమ్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్లర్‌కి ‘ఇది నా బయోపిక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఆసక్తికరం. దర్శకుడిగా నా మూడో చిత్రమిది. నా తొలి సినిమా ’33 ప్రేమకథలు’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రెండో సినిమా ‘సకల కలవల్లభుడు’ చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది” అన్నారు.
నటుడు జీవా మాట్లాడుతూ… “చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తేనే చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉంటుంది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే… ఇందులో ముఖ్యమైన పాత్ర చేస్తున్నా. దర్శకుడు శివగణేష్ చాలా పట్టుదల కల వ్యక్తి. అనుకున్నది సాధించేవరకూ వదిలిపెట్టడు. అతని దర్శకత్వంలో రూపొందిన ‘సకల కళావల్లభుడు’లో నటించా. అతడితో మరో సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.
హీరో విశ్వ మాట్లాడుతూ… “హీరోగా నా మొదటి సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి నా మిత్రుడు. చక్కటి టీమ్. ప్రేక్షకుల ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రవిచంద్ర ఈమండి మాట్లాడుతూ… “దర్శకుడు శివగణేష్ నా మిత్రుడు, శ్రేయోభిలాషి. అతను కథ చెబుతున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలిగింది. అంత ఆసక్తికరమైన కథ. వచే నెల (జూలై) 26వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ షెడ్యూల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. టోటల్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ… “శివగణేష్‌తో మూడో చిత్రమిది. సంగీత దర్శకుడిగా ఐదో సినిమా. ఈ సినిమాలో పాటలకు చక్కటి సందర్భాలు కుదిరాయి” అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘జబర్దస్త్’ మురళి, కథానాయిక నిఖిత పవర్ తదితరులు పాల్గొన్నారు.
30 ఇయర్స్ పృథ్వీ, జీవా, అపూర్వ, ‘జబర్దస్త్’ మురళి, పప్పు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్ట్: సుమిత్ పటేల్, యాక్షన్: నందు, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, మ్యూజిక్: అజయ్ పట్నాయక్.