విశాల్… ‘నడిగర్ సంఘం’ ప్రధాన కార్యదర్శిగా, ‘తమిళ సినీ నిర్మాతల మండలి’ అధ్యక్షుడుగా వ్యవహారిస్తున్న విశాల్… సామాజిక సేవలోను తన ముద్ర వేస్తున్నారు.తమిళ సినిమాలో విప్లవాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న విశాల్ రాజకీయాల్లోనూ సత్తా చాటుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు విశాల్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ దిశగానే తను నిర్వహిస్తున్న ‘మక్కల్ నల ఇయక్కం’ను రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడుగా వ్యవహారిస్తున్న విశాల్… సామాజిక సేవలోను తన మార్కు చూపిస్తున్నారు. తన తల్లి పేరిట స్థాపించిన దేవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేయడమే కాకుండా, ప్రజాసమస్యల కోసం గళం విప్పుతున్నారు. అలాగే తన సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత రైతుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు.
విశాల్ రాజకీయ ప్రయాణం గతేడాదిలోనే ఆరంభమైంది. 2017, డిసెంబరులో జరిగిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించి, ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి నిరాకరించడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయినప్పటికీ, తరచుగా ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ‘ఇరుంబుతిరై’ చిత్రం 100వ రోజు వేడుకలో ..తన పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘాలను ‘మక్కల్ నల ఇయక్కం’గా మార్చుతున్నట్టు ప్రకటించారు.
విశాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ… గ్రామాల్లో ప్రతి ఇంటా సిరులు కురవాలని, భావితరం భవిత బాగుండాలనే ప్రతి ఒక్కరూ తనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తాను స్థాపించిన ‘మక్కల్ నల ఇయక్కం’ పార్టీగా మారుతుందని, ఇక నుంచి తాను క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటిం చారు. అంతేకాకుండా తిరుప్పరంకుండ్రం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు విశాల్ సూచన ప్రాయంగా వెల్లడించారు.