సినీవినోదం రేటింగ్ : 3/5
హరి వెంకటేశ్వర , విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ల పై మిస్కిన్ దర్శకత్వం లో హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు
అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్) ఓ ప్రైవేట్ డిటెక్టివ్. ఆద్వైత భూషణ్ తెలివైన వాడు. డబ్బుకు లొంగే రకం కాదు. అందుకే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా, అలాంటి ప్రాజెక్ట్ లను తీసుకోడు.ఎప్పుడూ తనవైన ఆలోచనల్లో మునిగి ఉంటాడు. ఇల్లు, తన ఫ్రెండ్ మను (ప్రసన్న) అతని లోకం. అలాంటి వ్యక్తి ఓ చిన్నపిల్లాడు ‘తన కుక్కపిల్ల చనిపోయిందని, దాని గురించి కనిపెట్టమని’ అడిగితే ఒప్పుకుంటాడు. ఆ కుక్కపిల్ల చావు గురించి సీరియస్‌గా తీసుకుని అతను వెతికే క్రమంలో చాలా విషయాలు బయటికి వస్తుంటాయి. ప్రమాదాలుగా చిత్రీకరించబడ్డ హత్యలు వెలుగులోకి వస్తాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అతనికి పలు విషయాలు అర్థం అవుతాయి. ఈ క్రమంలోనే అతనికి జేబుదొంగ మల్లిక (అను ఇమ్మాన్యుయేల్) పరిచయమవుతుంది. విలన్ గ్యాంగ్ మనుషులు కూడా ఒక్కొక్కరుగా పరిచయమవుతుంటారు. తమ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న ఆదిని వారు అడ్డు తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా సినిమాలో చూడాలి ….
విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తప్పకుండా తెలుగులోకి అనువాదమవుతూనే ఉంటుంది.
విశాల్ తాజాహిట్ ‘తుప్పరివాలన్’ చిత్రం ‘డిటెక్టివ్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మిష్కిన్‌తో ఎనిమిదేళ్ల నుంచి విశాల్ సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నాడో ప్రేక్షకుడికి అర్థమయ్యే సినిమాఈ ‘డిటెక్టివ్’ . ఇది పూర్తిగా దర్శకుడి సినిమా.దర్శకుడు మిస్కిన్ డిటెక్టివ్ సినిమాకు స్క్రీన్ ప్లే ముఖ్యమనే సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుని … తీసుకున్న కథ చిన్నదే అయినా, కథనాన్ని మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. కథనంలో అనవసరమైన పాత్రలకు, సంభాషణలకు చోటివ్వకుండా సినిమాను నడిపి ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా డిటెక్టివ్ వరుస హత్యల మిస్టరీని ఛేదించే పనిలోకి దిగినప్పటి నుండి కథనంలో అనేక మలుపులను ప్రవేశపెట్టి, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సెకండాఫ్ ను బాగా డీల్ చేశాడు. సినిమా నుంచి రెప్పపాటు దృష్టి పక్కకు మళ్లినా అర్థం కాదేమో అనిపిస్తుంది. సినిమా యూనిట్ ముందే చెప్పుకున్నట్టు … సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మెల్లిగా కుర్చీలో రిలాక్స్ స్టేజ్ నుంచి క్రమంగా సీట్ కార్నర్‌కు చేరుకుని సినిమా చూస్తాడు. ఇన్వెస్టిగేటివ్ తరహా సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి చాయిస్ గా నిలుస్తుంది.కాకుంటే ఇందులో సైంటిఫిక్ అంశాలు చాలా ఉంటాయి. ‘ఉరుముకన్నా ముందు మెరుపు వస్తుంద’నే విషయంతో పాటు ఇంకా పలు విషయాలు సామాన్య ప్రేక్షకులకు అర్ధం కావు . అలాగే రెగ్యులర్ మసాలా లేకుండా సాగే స్లో నేరేషన్ కూడా వారికి రుచించదు .
తెలివైన డిటెక్టివ్‌గా విశాల్ నటన ఆకట్టుకుంటుంది. పాత్రకు న్యాయం చేశాడు. ప్రత్యేకమైన డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ తో ఇంటెలిజెన్స్ ను ప్రదర్శిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కును చూపిస్తూ మెప్పించాడు.అను ఇమ్మాన్యుయేల్ పాత్ర మరీ చిన్నది. హీరో, హీరోయిన్ల మధ్య పాటగానీ, రొమాంటిక్ సీన్‌గానీ ఉండదు.ప్రసన్న పాత్ర సినిమాకు హైలైట్ అవుతుంది. ఫ్రెండ్ పాత్రలో ప్రసన్న చాలా బాగా ఒదిగిపోయాడు. నెగటివ్ షేడ్స్ లో ఆండ్రియా నటన ఆకట్టుకుంటుంది. ఫైట్స్ , బైక్ రైడింగ్ సన్నివేశాల్లో ఆండ్రియా బాగా చేసింది . క్రూరుడైన విలన్‌గా వినయ్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చనిపోతున్నా… ఇల్లాలి బాగోగులు చూసుకునేవారు ఉండరని , భాగ్యరాజ్ తన భార్యను చంపే సన్నివేశాలు …. కళ్లముందే భర్తను, కొడుకును పోగొట్టుకున్న సిమ్రన్ ఆవేదన ప్రేక్షకుల మనసులను తాకుతుంది. చైనీస్ రెస్టారెంట్ లో జరిగే ఫైట్, పిచ్చావరం నీళ్లల్లో జరిగే ఫైట్లు సినిమాకే హైలైట్.
అర్రోల్ కొరెల్లి ఒక పూర్తిస్థాయి డిటెక్టివ్ థ్రిల్లర్ కు ఎలాంటి ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలో అలాంటిది అందించి సినిమాకి ప్రధాన బలం గా నిలిచాడు .కార్తీక్ వెంకట్రామన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజేశ్.ఎ.మూర్తి ప్రతి డైలాగూ చక్కగా రాసారు– ధరణి