మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ‘అభిమన్యుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
విశాల్ మాట్లాడుతూ … “మా అభిమన్యుడు సినిమా సెన్సార్ పూర్తయ్యింది. కాబట్టి సినిమాను జూన్ 1న విడుదల చేయబోతున్నాం. తమిళంలో ‘ఇరుంబు తిరై’ పేరుతో విడుదలైన ఈ చిత్రం నా కెరీర్లోనే పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘అభిమన్యుడు’గా తెలుగులో విడుదల చేస్తున్నాం. చాలా సంవత్సరాలు తర్వాత రివ్యూస్ పరంగా, కలెక్షన్స్ పరంగా నాకు శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చిన చిత్రం. తమిళనాడులో విడుదల చేసినప్పుడు సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రెండు షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఎగైనెస్ట్ డిజిటల్ ఇండియా, ఎగైనెస్ట్ ఆధార్ కార్డ్ అని సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. కానీ పోలీసులు మాకెంతో సపోర్ట్ చేశారు. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులకు నచ్చడంతో అన్నీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సినిమాలో చూడబోయే విషయాలు షాకింగ్‌గా ఉంటాయి. ఏటీంలో జరిగే మోసాలు, బ్యాంకు లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు, మిలటరీ ఆఫీసర్‌కి పాస్‌బుక్ లేదు అనే విషయం… మన ఫేస్ బుక్‌లో అన్నీ విషయాలను ఓపెన్‌గా చెప్పేస్తున్నాం. అవన్నీ మనకు భవిష్యత్‌లో ఇబ్బందులను కలిగించేవే. ఈ సినిమాలో అర్జున్‌గారు వైట్ డెవిల్ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఆయన నన్ను ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేశారు. సమాజంలో జరుగుతున్న విషయాలను ధైర్యంగా సినిమా రూపంలో మిత్రన్ డైరెక్ట్ చేశాడు. మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. సమంత రూపంలో మంచి హీరోయిన్ దొరికింది. ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. నటుడుగానే కాదు, నిర్మాతగా కూడా సంతోషాన్ని ఇచ్చిన సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీరు మీ ఫోన్‌ను జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. భవిష్యత్‌లో మన చుట్టు ఉన్న పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. సమాజంలో జరిగే విషయాలను చెప్పడానికి మాకు బాధ్యత ఉంది. ప్రేక్షకులకు నిజాలను చెప్పడానికి ‘సినిమా’ అనే మీడియాని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఆధార్ కార్డ్, డిజిటల్ ఇండియా వల్ల ప్రజలు ఫేస్ చేయబోయే పరిస్థితులను ఇందులో చూపించబోతున్నాం. అలాగని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా చేయలేదు. ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇంత స్ట్రాంగ్ కంటెట్‌ను ఇంత ధైర్యంగా ఎలా చెప్పారని చాలా మంది అడిగారు. ‘ఇలాంటి విషయాలను చెప్పడానికి ధైర్యం అవసరం లేదు. బాధ్యత ఉంటే చాలు’ అని చెప్పాం. ఇది వేదిక కాకపోయినా ఓ ఓటర్‌గా, పౌరుడిగా ప్రశ్నించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈ మధ్య తమిళనాడు తూత్తుకూడిలో జరిగిన ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయారని అంటున్నారు. కానీ 30 మంది దాకా అనధికారికంగా చనిపోయారని అంటున్నారు. చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అసలు ఆ ఘటన జరగడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాని నేను వేసే ఒకే ఒక ప్రశ్న.. ఆరోజు షూటింగ్ ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పే తీరాలి. సినిమాలో ఏ విషయముందో తెలియకుండానే నిరసన ప్రదర్శనలు చేయడం ఎంత వరకు సమంజసం. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నేను ఎవరికి భయపడాలి. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. దీని ద్వారా పాటలనో, ఫైట్స్నో చూపించకుండా సమాజంలో జరిగే విషయాలను చూపించాల్సిన బాధ్యత మాకు ఉంది. నటుడిగా, నిర్మాతగా మంచి పేరుని తీసుకొచ్చిన సినిమా ఇది. పెళ్లైన హీరోయిన్ సినిమాల్లో నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సినిమాలు చేసి సక్సెస్ కొట్టారు. నేను రాజకీయాల్లోకి వచ్చేశాను. నేను ఇంట్లో కూర్చుని రాజకీయాలు మాట్లాడను. 2019 ఎన్నికల్లో నేను యాక్టివ్‌గా ఉంటాను. నేను రాజకీయాల్లో రావడం ముఖ్యం కాదు. యువత ముందుకు రావాలి. భయపడటం లేదు.. మనమే భయపడితే ఎవరూ ప్రశ్నిస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నా క్యారెక్టర్‌కు కోపం ఎక్కువగా ఉంటుంది. సమంత సైక్రియాటిస్ట్ పాత్రలో కనిపిస్తారు“ అన్నారు.
మిత్రన్ మాట్లాడుతూ…“దర్శకుడిగా నా తొలి చిత్రం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే చిత్రం. ప్రస్తుతం డిజిటల్ ఇండియా అని అంటున్నారు. దీని వల్ల చాలా వృద్ధి జరుగుతుందని అంటున్నారు. కానీ డిటిజిటలైజేషన్కు మరో వైపు ఎలా ఉంటుందని ఈ సినిమాలో చూపించాం. అందరూ సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’ అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ … “అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో… అలాగే అన్ సక్సెస్‌పుల్ హీరో. కానీ ఇక్కడ మా హీరో సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈ చిత్రం తమిళనాడు రిలీజై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. జూన్ 1న తెలుగులో అభిమన్యుడు రిలీజ్ కాబోతుంది. డిఫరెంట్ కమర్షియల్ మూవీ. ఈ కాలానికి ట్రైలర్ మేడ్లాంటి మూవీ. మిత్రన్ తొలి చిత్రాన్నే చక్కగా తెరకెక్కించారు. ఇప్పటి వరకు నన్ను డిఫరెంట్ క్యారెక్టర్లో చూసుంటారు. ఇది విభిన్నమైన క్యారెక్టర్. గ్రే షేడ్‌లో స్టైలిష్ క్యారెక్టర్. అందరికీ గ్యారెంటీగా నచ్చుతుంది. విశాల్ హీరోగానే కాదు. నిర్మాతగా కూడా సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. విశాల్‌తో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆయన నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు బాధ్యాతయుతమైన వ్యక్తిగా ఉన్నారు. సమంతకు కూడా నా అభినందనలు. టెక్నికల్‌గా సినిమా చాలా బావుంటుంది. యువన్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఎసెట్ అవుతుంది. డిజిటల్ ఇండియా అనేది మనకు ఎంత వరకు మంచిది అని ఈ సినిమాలో చూపిస్తున్నాం. జీవితంలో అప్డేట్గా ఉండటం మంచిదే. కొత్త విషయాలను తెలుసుకోవడం మంచిదే. అయితే అలాంటి రూట్లో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పే చిత్రమిది“ అన్నారు.
సమంత మాట్లాడుతూ… “తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలు తర్వాత తమిళంలో ఇరుంబుతిరైతో సక్సెస్ అందుకున్నాను. ఏ న్యూస్ చానెల్ చూసినా ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అనే విషయం గురించి అందరూ మాట్లాడుతున్నారు. వాటి గురించి అవేర్నెస్ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మిత్రన్ డెబ్యూ డైరెక్టర్‌గా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా తమిళనాడులో సక్సెస్ అయినట్లే తెలుగులో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను“ అన్నారు.