ప్రముఖ నటులు, `మా` అధ్యక్షులు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం `ఏదైనా జరగొచ్చు`. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా… రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్, ఎస్ వి కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, హీరోలు శ్రీకాంత్, తరుణ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివాజీరాజా మాట్లాడుతూ…“32 ఏళ్లుగా నటుడుగా నన్ను ఆదరిస్తున్నారు. అదే ఆదరణ , ప్రేమ మా అబ్బాయి విజయ్ రాజాకు కూడా అందించాలని కోరుకుంటున్నా. చాలా స్టోరీలు విన్నాక నాకు, మా అబ్బాయికి ఈ స్టోరీ నచ్చి ఫైనల్ చేశాం. దర్శకుడు రెండేళ్లుగా ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నాడు. విజయ్.. సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్ లోకే మా అబ్బాయి కూడా రావడం హ్యాపీ. విజయ్ నన్ను సలహా అడిగినప్పుడు.. ‘నీకు ఎలా అనిపిస్తే అలా చేయి.. మెగాస్టార్ చిరంజీవిగారిలా కష్టపడు, సూపర్ స్టార్ కృష్ణ గారిలా సేవాతత్పరత కలిగి ఉండని’ చెప్పాను. పాటిస్తాడని నమ్ముతున్నాను. ఈ సినిమా దర్శకుడికి పేరు, నిర్మాతకు లాభాలు తేవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు కె. రమాకాంత్ మాట్లాడుతూ…“చంద్రశేఖర్ ఏలేటి గారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతో `ఏదైనా జరగొచ్చు` చిత్రానికి డైరక్షన్ చేస్తున్నా. హర్రర్ జానర్లో సాగే కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కథ నచ్చి, నా పై నమ్మకంతో శివాజీరాజాగారు, మా నిర్మాత ఈ అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను“ అని అన్నారు.
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ…“నేను హీరో అవడానికి అమ్మా నాన్నల సపోర్ట్ తో పాటు మావయ్య సపోర్ట్ ఎంతో ఉంది. నాన్న గర్వపడేలా చేస్తానన్న నమ్మకంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా. దర్శకుడు మంచి కథతో వచ్చారు. నా మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన వెట్ బ్రెయిన్ సంస్థకు ధన్యవాదాలు“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రకాష్ అన్నంరెడ్డి మాట్లాడుతూ…“కామెడీ హర్రర్ తో పాటు థ్రిల్లర్ అంశాలతో సాగే చిత్రమిది. చంద్రశేఖర్ ఏలేటి గారి వద్ద దర్శకుడు రమాకాంత్ చాలా చిత్రాలకు పని చేశారు. దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్టు పై దర్శకుడు వర్క్ చేశారు. శివాజీ రాజా గారు మా మీద నమ్మకంతో వారబ్బాయిని పరిచయం చేసే అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం“ అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః శ్రీకాంత్ పెండ్యాల; ఆర్ట్ డైరక్టర్ః చిన్నా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః విజయ్ ప్రకాష్ అన్నంరెడ్డి; ప్రొడ్యూసర్ః వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్మెంట్; దర్శకుడుః కె.రమాకాంత్.