విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ‘రోషగాడు’ సినిమా విడుదల ముందస్తు కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సినిమాలో నివేథా పేతురాజ్ కథా నాయిక. గణేశ దర్శకుడు. పార్వతి మిట్టపల్లి నిర్మాత. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ నెల 16న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ టి.వి.హనుమంతరావు మాట్లాడుతూ… ‘‘విజయ్ ఆంటోనీని పోస్టర్లో చూస్తుంటే 20 యేళ్ల కిందట నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ని చాలాసార్లు చూశాను. ఈ చిత్రం కూడా ఆ స్థాయిలో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ… ‘‘విజయ్ ఆంటోనీ విభిన్నమైన పాత్రలు ఎంచుకొంటారు. కొన్ని సినిమాలతోనే ఎంతో ఇమేజ్ తెచ్చుకొన్నార’’న్నారు.
రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ… ‘‘రెండు సినిమాల్లో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొంటూ ఒక శక్తిమంతమైన పాత్రతో వస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఇలాంటి కథకి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. మాటలతో పాటు పాటలన్నీ నేనే రాశాను’’ అన్నారు.
దర్శకుడు గణేశ మాట్లాడుతూ… ‘‘తమిళంలో ‘నంబియార్’ సినిమా చేశా. దానికి సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. ఇప్పుడు ఆయనతో ఈ చిత్రం చేశాను. విజయేంద్రప్రసాద్గారికి ఈ కథ వినిపించినప్పుడు విజయ్ ఆంటోనీ పేరునే సూచించారు. భావోద్వేగాలతో కూడుకొన్న డ్రామా ఈ చిత్రం’’ అన్నారు.
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ… ‘‘నా సినిమాల్లో కథే హీరో, నేను కాదు. నేను నటుడినే కాదు, సౌండ్ ఇంజినీర్ని, సంగీత దర్శకుడిని. గణేశ మూడేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డారు’’ అన్నారు.
కార్యక్రమంలో గణపతి, సానం రామకృష్ణ, విజయ్, సురేష్ కొండేటి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.