టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఎక్కడైనా రెడీ అంటున్నాడు. హిందీలో సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో నడుమ ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. దీనికి బ్యాడ్ టాక్ వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో రష్మిక భలే చేసిందని ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది.
అక్కడ మాత్రం సూపర్ హిట్
ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో క్లిక్స్ వస్తున్నాయి. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో ‘డియర్ కామ్రేడ్’ దూసుకుపోతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారని తెలుస్తోంది. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని సమాచారం.గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో సెన్సార్ లేకుండా చూపించారు. దీంతో సినిమాలో మ్యూట్ చేసిన బూతు డైలాగులు కూడా ఇక్కడ వినిపించారు. దీంతో విజయ్ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ కారణంగానే ‘డియర్ కామ్రేడ్’కు కూడా ఊహించని స్పందన వచ్చిందని అంటున్నారు.
కరణ్ జోహార్‌తో సినిమా
తెలుగు సినిమాలే తనకు మొదటి ప్రాధాన్యమని ఇప్పటివరకూ చెప్పిన హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. హిందీలో సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. ఇటీవల విజయ్ చేసిన ‘డియర్ కామ్రేడ్’ నిరాశపరిచిన తర్వాత.. కొత్తదనం కోసం తపిస్తున్నాడు.ఆల్రేడీ దక్షిణాదిలో ఉన్న నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’ విడుదల అయిపోయింది. ఇక, హిందీలోనూ దీన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను చిత్ర యూనిట్ కలిసింది. దీని తర్వాత తాను ‘డియర్ కామ్రేడ్’ను హిందీలోకి రీమేక్ చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఆ సినిమా బ్యాడ్ ఫలితంతో రీమేక్ ఆగిపోయింది.
ఇప్పుడు విజయ్ విభిన్నంగా ఉన్న కథల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. ప్రస్తుతం విజయ్ ముంబాయిలో ఉన్నాడు. అక్కడ హిందీ దర్శక నిర్మాతలతో చర్చలు చేస్తున్నాడు. కరణ్ జోహార్‌తో సినిమా విషయమై చర్చించారు. కరణ్ జోహార్, ఇతర నిర్మాతలు కొన్ని కథలను.. విజయ్‌కి వినిపించారట. అందులో ఓ సినిమా చేసేందుకు విజయ్ ఓకే అన్నాడట. ఆ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించనున్నాడు.
విజయ్ మరో రెండు రోజుల్లో కొంతమంది యువ దర్శకులతో సమావేశం కానున్నాడు. ప్రస్తుతం విజయ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ విడుదల తేదీని ప్రకటించలేదు. జనవరి నుంచి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించనున్నాడు.