డీలాపడ్డ పొలిటికల్ డ్రామా… ‘నోటా’ చిత్ర సమీక్ష

                                                సినీవినోదం రేటింగ్ : 2/5

స‌్టూడియో గ్రీన్‌ బ్యానర్ పై ఆనంద్ శంక‌ర్‌ దర్శకత్వంలో కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు
కథలోకి వెళ్తే…
వాసుదేవరావ్‌(నాజ‌ర్‌) సిబిఐ కేసుని ఎదుర్కొవ‌డానికి త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. త‌న స్థానంలో త‌న కొడుకు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ని సీఎంని చేస్తాడు.  సిబిఐ కేసు కార‌ణంగా జైలు కెళ్తాడు వాసుదేవ‌రావ్‌. ముందు సీఎం ప‌ద‌విని బాధ్య‌త‌గా ప‌ట్ట‌ని వ‌రుణ్ త‌ర్వాత సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ప్రారంభిస్తాడు.వ‌రుణ్‌కి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర (స‌త్య‌రాజ్‌) నుండి స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మంచి పేరు సంపాదించుకుంటాడు. అదే స‌మ‌యంలో బెయిల్‌పై విడుద‌లైన వాసుదేవరావ్‌ని చంపే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌రిగిన బాంబు దాడి కార‌ణంగా… అత‌ను కోమాలోకి వెళ్తాడు. అస‌లు త‌న తండ్రిని ఎవ‌రు చంపాల‌నుకున్నార‌నే విష‌యాల‌ను క‌నుక్కోవ‌డానికి వ‌రుణ్ ప్ర‌య‌త్నిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో.. వ‌రుణ్‌కి బ్లాక్‌మ‌నీకి సంబంధించిన చాలా విష‌యాలు తెలుస్తాయి. అప్పుడు వ‌రుణ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాడు? ముఖ్య‌మంత్రిగా వ‌రుణ్ ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు? వాటికి ఎలాంటి ప‌రిష్క‌రాలు క‌నుక్కుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
సమీక్ష…
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నోటా’. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. ‘అరిమనంభి’, ‘ఇరుముగన్‌’ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్‌ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు.ఆనంద్ శంక‌ర్ పొలిటిక్ క‌థ‌ను ప్రస్తుతం త‌మిళ నాడు రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా జ‌రిగిన ప‌రిస్థితులను ఆధారంగా చేసుకుని రాసుకున్నాడు. ఫామ్‌హౌజ్‌ రాజకీయాలు, ముఖ్యమంత్రికి వంగి వంగి సలామ్‌లు కొట్టే నేతలు, నమ్మిన బంటుని ముఖ్యమంత్రిని చేయడం ….అంతా కూడా తమిళనాడు రాజకీయాలకే అద్దం పడుతుంది. జ‌య‌ల‌లిత చ‌నిపోయిన‌ప్పుడు మ‌న్నార్ గుడి మాఫియా ఎలా ప్ర‌వ‌ర్తించింది. త‌మ‌కు న‌చ్చిన అభ్య‌ర్థిని సీఎంగా గెలిపించ‌డానికి ఎమ్మెల్యేల‌ను రిసార్ట్స్‌లో ఉంచే స‌న్నివేశాలు.. వ‌ర‌ద‌లతో న‌గ‌రం మునిగిపోయే సీన్‌లో .. గ‌తంలో చెన్నై న‌గ‌రం వర్షాల కార‌ణంగా ప‌డ్డ ఇబ్బందుల‌ను తెర‌పై చూపించారు.విజయ్‌ దేవరకొండకి తెలుగునాట వున్న మార్కెట్‌ కోసమని ‘నోటా’ని ఇక్కడికి అనువదించారే కానీ..ఏ విధం గానూ మన తెలుగు రాష్ట్రాలని ప్రతిబింబించని రాజకీయ చిత్రమిది.ఒక పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ సెటైర్‌ని, అలాగే యూత్‌కి మంచి మెసేజ్‌ని ఇవ్వడానికి స్కోప్‌ వున్న కాన్సెప్ట్‌ని బలహీనమైన స్క్రిప్ట్‌తో, దిశా దశ లేని దర్శకత్వంతో పూర్తిగా వృధా చేసారు.ఇక ముఖ్యమంత్రి వెనకనుంచి కథ నడిపించే స్వామీజీ పాత్రని కూడా సరిగా హైలైట్‌ చేయలేదు. చాలా ముఖ్యమయిన పాత్ర అయినా.. అది బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అవుతుంది. తన తండ్రి తాలూకు బినామీ ఆస్తులని హీరో కైవసం చేసుకునే సన్నివేశాలు కూడా గజిబిజి గందరగోళంగా అనిపిస్తాయే తప్ప థ్రిల్‌ ఇవ్వవు. విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ సన్నివేశాల్లో రాణించిన తీరు మినహా ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ అంశాలేమీ లేవు.సీరియస్‌ పొలిటికల్‌ డ్రామాలని ఆసక్తిగా చూసే వారిని కూడా నోటా నిరాశపరుస్తుంది.
నటీనటులు…
విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాకు పెద్ద ఎసెట్.  రాజ‌కీయాల‌తో సంబంధం లేని ఓ యువ‌కుడు అనుకోకుండా రాజ‌కీయాల్లోకి రావ‌డం .. అక్కడ ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను ద‌ర్శ‌కుడు చూపించే సందర్భాల్లో  విజ‌య్ దేవ‌ర‌కొండ బాడీలాంగ్వేజ్ హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ బ‌స్‌ను కాల్చివేసే స‌న్నివేశంలో విజ‌య్ న‌టన ఆక‌ట్టుకుంటుంది. అలాగే.. వ‌ర‌ద‌ల స‌మయంలో యువ‌త‌ను ప్రేరేపించే స‌న్నివేశం.. ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై వేసిన అభాండాన్ని తెలివిగా త‌ప్పించుకునే స‌న్నివేశాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.ఇక ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేదు. ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. ఫిమేల్ లీడ్ లో మరో కీలక పాత్రలో కనిపించిన సంచనా నటరాజన్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది.ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్ ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్ తన గాంభీరమైన నటనతో ఆకట్టుకోగా… కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు.
సాంకేతికవర్గం…

సి యస్ సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది . కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు.యస్. కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చక్కగా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగదీసిన సన్నివేశాలను తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి  -రాజేష్