కిక్ ఇవ్వని కామెడీ… ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25 /5

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం లో వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… రాకేష్‌(త‌రుణ్ భాస్క‌ర్‌), కామేష్‌(అభిన‌వ్ గోమ‌టం) చిన్న‌నాటి నుండి మంచి స్నేహితులు… ఓ చిన్న టీవీ ఛానెల్‌లో ప‌నిచేస్తుంటారు. రాకేష్‌కి త‌ను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఫిక్స‌వుతుంది. రాకేష్‌కి కాబోయే భార్య.. త‌న భ‌ర్త సిగ‌రెట్స్‌, మందు, అమ్మాయిల‌కు దూరంగా ఉండాల‌ని అనుకుంటుంది. అయితే అన్ని అల‌వాట్లున్న రాకేష్.. ప్రేమ కోసం అబ‌ద్ధం చెబుతాడు. పెళ్లి తేది ఖ‌రార‌వుతుంది. అదే స‌మ‌యంలో రాకేష్ న‌టించిన ఓ ఆగిపోయిన సినిమాలో.. బూతు వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో లీక్ అవుతుంది. పెళ్లి రెండు రోజుల ముందు వీడియో లీక్ కావ‌డంతో రాకేష్ ఎంతో భ‌య‌ప‌డ‌తాడు. త‌న పెళ్లి ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని భ‌య‌ప‌డ‌తాడు. ఆ స‌మ‌యంలో త‌న స్నేహితులు కామేష్‌, పాపాతో క‌లిసి హ్యాక‌ర్‌ను క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. చివ‌ర‌కు వీడియో ఉన్న లింక్‌ను హ్యాక్ చేసి డిలీట్ చేశారా? అస‌లు ఆ వీడియో అప్‌లోడ్ చేసిందెవ‌రు? తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…

విషయం… హీరోగా బ్రేక్ ఇచ్చిన త‌రుణ్ భాస్క‌ర్‌ను హీరోగా పెట్టి విజ‌య్ దేవ‌రకొండ ..ష‌మీర్ సుల్తాన్ అనే కొత్త దర్శ‌కుడితో ఈ సినిమా చేశాడు. వ్యక్తిగత విషయాలు సోషల్‌ మీడియాలో లీకై రచ్చ అవ్వడం.. చూస్తూనే ఉన్నాం. ఇది అలాంటి కథే. అయితే , కేవలం ఒక చిన్న పాయింట్‌ చుట్టే కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు షమ్మీర్‌ ఈ కథను తిప్పాడు. ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే అయినప్పటికీ.. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండా.. ప‌రిమిత‌మైన పాత్ర‌ల‌తో..కేవలం కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలచడంపైనే దర్శకుడి దృష్టి పెట్టాడు.కొంతమేరకు సక్సెస్‌ అయ్యాడు.ఫస్టాఫ్‌ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతుంది. అయితే, సెకండాఫ్‌లో అంతగా కామెడీ లేకపోవడం..స్క్రీన్‌ప్లే ఇంట్రస్టింగ్‌గా సాగకపోవడంతో బోర్ ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమా చివర్లో వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్‌ దేవరకొండ అలరించాడు.
 
నటన… తొలిసారిగా హీరోగా చేసిన తరుణ్‌ భాస్కర్‌ తన నటనతో సినిమాకు ప్లస్‌ అయ్యాడు. చాలా సీన్లలో తరుణ్‌ సహజంగా నటించాడు. త‌రుణ్‌భాస్క‌ర్‌ను ఏదో హీరోగా చూపించాల‌నే తాపత్రయంతో కాకుండా.. పాత్ర‌ధారిగా క‌థానుగుణంగా దర్శకుడు చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు.తరుణ్‌ ఫ్రెండ్‌ కామేశ్‌గా అభినవ్‌ గోమటం మరోసారి అలరించాడు.అభిన‌వ్ గోమ‌టం న‌ట‌నతో సినిమాలో నవ్వులు పూయించాడు. హ్యాకర్‌ పపా అక్కగా కీల‌క పాత్ర‌లో అనసూయ కనిపించారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. అబద్దాలు నచ్చని, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ చక్కగా సరిపోయింది. అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి, నవీన్‌ జార్జ్‌ థామస్‌ తక్కువ నిడివి గల పాత్రలలో పరవాలేదనిపించారు.
శివకుమార్ కథలో భాగంగా స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది.
మాథన్ గుణదేవ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ఎడిటింగ్ బాగున్నాయి – రాజేష్