‘యూత్ స్టార్’ విజయ్ దేవరకొండ ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సాయాన్ని ప్రకటించారు…
ప్రపంచమంతా సమస్యలో ఉంది. డబ్బులు లేకపోయినా కుటుంబసభ్యుల బాగోగులు చూసుకోవడం నాకు కొత్తకాదు. కానీ, 35 మందికి జీతాలు ఇవ్వడం అనేది మాత్రం మాకు కొత్త. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడం వల్ల, నా పర్సనల్ స్టాఫ్ పెరగడం వల్ల నాకు ఎంప్లాయిస్ పెరిగారు. వాళ్లకు జీతాలివ్వడం ఇలాంటి సమయంలో నా కర్తవ్యం. గత నెల రోజులుగా డబ్బులను అరేంజ్ చేయడంలో గడిచిపోయింది. బయట చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లందరికీ ఏమైనా చేయాలనే ఆలోచన నన్ను చుట్టుముడుతోంది. ఈ రోజు నేను రెండు ప్రధానమైన ప్రకటనలు చేస్తున్నాను. కరోనా క్రైసిస్ వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిలో మేం రెండు విషయాలను ఎంపిక చేసుకున్నాం. అవేంటంటే.. 1. వెంటనే కావాల్సిన అవసరాలను తీర్చడం 2. భవిష్యత్ అవసరాలను నేరవేర్చడం.
లక్ష మందికి ఉద్యోగాలు లక్ష్యం!
కరోనా వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్య రానుందో దాన్ని తీర్చడం కోసం.. మన యూత్‌ని ఉద్యోగాలకు అన్నివిధాలా అర్హులుగా తీర్చిదిద్దాలి. అవసరానికి అన్నం పెడితే ఆ రోజు గడుస్తుంది… కానీ, సంపాదన మార్గాలను నేర్పిస్తే వాల్లంతట వాళ్లు బతుకుతారని నా నమ్మకం. కరోనా పరిస్థితి వల్ల భవిష్యత్తులో నిరుద్యోగులు పెరుగుతారని …ఇప్పటికే కొందరిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అందుకోసం జులై 2019లో నేను సీక్రెట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యం. ఆగస్టు 2019లో ఈ సీక్రెట్ ఫ్రాజెక్ట్ కోసం ఓ టీమ్‌ను నియమించుకున్నాను. 50 మంది అబ్బాయిలు, అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పించడం ఈ టీమ్ తొలి గోల్.
‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’(టీడీఎఫ్)…
మా ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్‌లో టీడీఎఫ్ సంస్థకు రూరల్ ఏరియస్ నుంచి 650 మంది తమ ప్రొఫైల్స్ పంపారు. అక్టోబర్‌లో ఈ 650 అప్లికేషన్లను 120కి కుదించాం. వీళ్లందరినీ మా ఖర్చులతో హైదరాబాద్‌కి పిలిపించి, ఇంటర్వ్యూలు చేశాం. నవంబర్‌లో మా తొలి బ్యాచ్ కోసం 50 మందిని వారిలో నుంచి ఎంపిక చేశాం. చాలా నైపుణ్యాలు కలిగిన వాళ్లు. డిసెంబర్లో ఈ 50 మందికి ట్రయినింగ్ ఇచ్చాం. ట్రయినింగ్లో మేం ఫోకస్ చేసేది ఏంటంటే… వాళ్లకు నచ్చిన రంగాల్లో.. వాళ్లకు అవసరమైన స్కిల్స్ ను, కమ్యునికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తున్నాం. నేను ఈ విషయాలను మొత్తం పూర్తయ్యాక చెబుదామనుకన్నా. కానీ ఇప్పుడు పరిస్థితుల వల్ల చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 50 మందిలో ఇద్దరికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. మిగిలిన 48 మందికీ త్వరలోనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. భవిష్యత్తులో మరికొంత మందికి ‘టీడీఎఫ్’(ది దేవరకొండ ఫౌండేషన్) ద్వారా అవకాశాలను కల్పించే పనిలో భాగంగా మా ఫౌండేషన్‌కి నేను కోటి రూపాయలను కేటాయిస్తున్నాను. మా ‘రౌడీ వేర్’ నుంచి, ‘కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్’ నుంచి కూడా రకరకాల ఉద్యోగాలను కల్పించబోతున్నాను. భవిష్యత్తు గురించి ఎవరైనా భయపడుతుంటే.. భయపడకండి. నేనే కాదు, ఇంకా చాలా మంది ఇలాంటి ఆలోచనలతో ముందుకొస్తారు. ప్రభుత్వాలు కూడా భరోసాను కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇందులో భాగంగా ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను సహాయంగా అందివ్వాలన్నది నా ఆలోచన. నేను ఒకప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చినవాడినే. మాలాంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారని తెలుసు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. వాళ్లు చేసే పనులు నేను చూస్తునే ఉన్నా. కేసీఆర్‌గారికి ధన్యవాదాలు. భోజనం నుంచి, కిట్స్ నుంచి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.తెల్ల రేషన్ కార్డులున్న వారికి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. అద్దె అడగవద్దని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తూనే ఉంది. ఎన్జీవోలు ఎంతో సాయం చేస్తున్నాయి. మా టీమ్ కూడా చాలా మంది వలస కూలీలకు సాయం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిగారి నాయకత్వంలో ఒకతాటిపై కార్మికుల కోసం సాయం చేయడం బావుంది.
‘మిడిల్ క్లాస్ ఫండ్’(ఎంసీఎఫ్)….
మేం ‘మిడిల్ క్లాస్ ఫండ్’ అని ఒకటి పెట్టాను. దీనికి 25లక్షలను కేటాయించాను. స్వయంఉపాధి చేసుకుంటూ బతికేవాళ్లయితే… ఇప్పుడు భోజనానికి కష్టంగా ఉంటే, వెంటనే మా వెబ్సైట్ కి మీ డీటైల్స్ పంపండి. ‘ద దేవరకొండఫౌండేషన్ డాట్ ఓఆర్జీ’ అనేది మా వెబ్సైట్ పేరు. మా వెబ్‌సైట్‌కి డీటైల్స్ ఇస్తే…మా టీమ్ మీకు ఫోన్ చేసి, మీ ఇంటిదగ్గర లోనే మీకు కావాల్సిన సరుకులు కొనిపిస్తాయి. మేం షాప్‌కి డబ్బులు పంపేస్తాం. ఎంత బడ్జెట్ వరకు కొనొచ్చు, ఏమేం సరుకులు కొనొచ్చు వంటి డీటైల్స్ మా సైట్లో ఉంటాయి. నిజంగా అవసరం ఉన్నవాళ్లే అడగండి. అవసరం లేనివాళ్లు అడగకండి. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకున్నవాళ్లు… భవిష్యత్ లో బావుంటే, తిరిగి ఇవ్వాలనుకుంటే ఫౌండేషన్‌కి తిరిగి ఇవ్వండి. ఎందుకంటే ఇంకో ఫ్యామిలీకి మేం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 25 లక్షలతో 2వేల మందికి సాయం చేయాలనుకుంటున్నాం. దీన్ని ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెడుతున్నాం.