విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. జి.శ్రీనివాసన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బేనర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ ఆడియో ఈ కార్యక్రమంలో రాధిక, శరత్‌కుమార్, జీవిత, డా.రాజశేఖర్, విజయ్ ఆంటోని, చదలవాడ శ్రీనివాసరావు, 786 ఫామ్స్ ఛైర్మన్ రఫీ, విలాసిత ఫామ్స్ ఛైర్మన్ రాజేంద్ర రెడ్డి నాయుడు, అళహరి ప్రతాప్ నాయుడు, స్నేహ గ్రూప్ వెంకట్ రెడ్డి, కె.ఎస్.రెడ్డి, జలీల్, సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజు, సురేష్ కొండేటి, రచయిత భాష్యశ్రీ, సింగర్ హేమచంద్ర, తదితరులు పాల్గొన్నారు. జీవిత, రాజశేఖర్ బిగ్ సీడీని, ఆడియో సీడీలను విడుదల చేశారు.
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ”విజయ్ ఆంటోనిగారికి ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ చిత్రంతో ఆయన మూడో హిట్‌ను సాధిస్తారని నమ్మకంగా ఉన్నాం” అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”విజయ్ ఆంటోని నాకు బిడ్డలాంటోడు. తను నటించిన బిచ్చగాడు సినిమాను నేను నలబై ఐదు లక్షలకు కొన్నాను. సినిమా విడుదలకు ముందు నైజా ఏరియాలోనే ఆ సినిమా నలబై ఐదు లక్షలకు అమ్ముడైపోయింది. సినిమా ముందు 50 థియేటర్స్‌లో మాత్రమే విడుదలైంది. కానీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయికి తీసుకెళతారనే దానికి బిచ్చగాడు ఓ నిదర్శనం” అన్నారు.
రాధిక మాట్లాడుతూ – ”మంచి సినిమాలను ఎంకరేజ్ చేసే ప్రేక్షకుల్లో నెంబర్ వన్ ప్రేక్షకులు తెలుగువారే. కమర్షియల్ సినిమాలైనా, పెద్ద, చిన్న సినిమాలంటూ తేడా లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను అన్ని భాషల్లో ప్రేక్షకులను చూశాను. కానీ తెలుగు ప్రేక్షకులను వంటి గొప్ప ప్రేక్షకులను చూడలేదు. నాపై ఆదరణ చూపే తెలుగు ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రసేన పేరుతో విడుదల చేయాలనుకోగానే, అది వరకు ఇదే టైటిల్‌తో సినిమా చేసిన చిరంజీవిగారిని, టైటిల్ విషయంలో సంప్రదించాం. ఆయన సినిమా చేసుకోమనడమే కాకుండా, సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నా థాంక్స్. జీవిత, రాజశేఖర్‌కు, సింగిల్ ట్రాక్‌ను విడుదల చేసిన రవితేజకు ధన్యవాదాలు. ఇదొక స్ట్రాంగ్ కంటెంట్. ముందుగా ఈ కథ విన్న శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. డిఫరెంట్ హీరో ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందని అన్నారు. అలా సినిమా మొదలైంది. ఇక నేను చిన్నపాప పెరియ పాప అనే సీరియల్‌ను నిర్మించినప్పుడు..దానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా విజయ్ ఆంటోనిగారిని పరిచయం చేశాను. నేను అడగ్గానే, ‘మీరు నన్ను పరిచయం చేశారు మేడమ్..మీకోసం సినిమా చేస్తాను’ అని వెంటనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సినిమా విషయానికి వస్తే సినిమా అంతటా పాజిటివిటీతో నిండి ఉంటుంది. ఇందులో భాగమైన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది” అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ – ”రాధిక, శరత్‌కుమార్‌లతో మాకెప్పటి నుండో పరిచయం ఉంది. ఇక విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ..ఆయన నటించిన బిచ్చగాడు సినిమా గురించి చాలా విషయాలే విన్నాను. నిజానికి ఆయన నటించిన పిచ్చైకారన్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటుండగానే సినిమా అనువాదమై విడుదలైంది. సినిమా సక్సెస్ అయ్యింది అని తెలియగానే..అయ్యో మంచి సినిమాను వదులుకున్నామే అని అనుకున్నాను. వెళ్లి చూస్తే..ఇంకా బాధ పడతానని బిచ్చగాడు సినిమాను చూడలేదు. దానిలో అమ్మపాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమే అయినా బిచ్చగాడు సినిమాను తప్పకుండా చూస్తాను. ఇప్పుడు ఇంద్రసేనలో 10 నిమిషాలను మాత్రమే చూశాను. చాలా బాగా నచ్చేసింది. విజయ్ ఆంటోనికి ఆల్ ది బెస్ట్. సినిమాను నిర్మించిన రాధిక, శరత్‌కుమార్, తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన నీలం కృష్ణారెడ్డికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
జీవిత మాట్లాడుతూ – ”విజయ్ ఆంటోనిగారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరత్‌కుమార్, రాధికగారు మంచి వ్యక్తులు. ఎదుటివారిని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ ఆంటోని సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్” అన్నారు.
భాష్యశ్రీ మాట్లాడుతూ – ”సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టుకుంటారు. దర్శకుడు శ్రీనివాసన్గారిని..సినిమా విడుదలైన తర్వాత వంద సినిమాలు డైరెక్ట్ చేశాడని అప్రిసియేట్ చేస్తారు. చాలా క్లారిటీతో సినిమా చేశారు శ్రీనివాసన్. విజయ్ ఆంటోని సినిమాలు స్లోగా స్టార్ట్ అయ్యి ఎక్కడికో రీచ్ అవుతాయి” అన్నారు.
దర్శకుడు జి.శ్రీనివాసన్ మాట్లాడుతూ – ”నేను ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఆయన నటించడమే కాకుండా ఈ సినిమాకు సంగీతం కూడా అందించారు. భాష్యశ్రీ ఈ సినిమాకు సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కావటం నా అదృష్టం. ఈ అవకాశాన్ని కలిగించిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థాంక్స్. నా మొదటి సినిమా. నన్ను తెలుగు ప్రేక్షకులకు ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
శరత్‌కుమార్ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో విజయ్ ఆంటోనిగారు అన్నా, తమ్ముళ్లుగా నటించారు. ఆయన కథ వినగానే ఎంతో ఇంప్రవైజ్ చేశారు. మంచి హృదయాలున్న అందరూ కలయికతో రూపొందిన చిత్రమిది. సినిమా అన్ని ఎమోషన్స్‌తో అందరికీ నచ్చేలా ఉంటుంది” అన్నారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ”దర్శకుడు శ్రీనివాసన్‌గారు సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. రాధిక బ్యానర్లో నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థాంక్స్. భాష్యశ్రీ, ఫాతిమాకు థాంక్స్” అన్నారు.