ఇటీవల కాలంలో విడుదలైన ‘దృశ్యం’, ‘గురు’ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలు వెంకటేష్ హీరోగా రీమేక్ విజయాలకు మంచి ఉదాహరణ.రెగ్యులర్ గా రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టే హీరోగా వెంకటేష్‌కు మంచి పేరుంది. వెంకీ తాజాగా మరో రీమేక్‌లో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా రూపొందిన ఆ సినిమా అక్కడ భారీ హిట్ అవడంతో, తమిళంలో విక్రమ్ హీరోగా, తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నారట. మలయాళ చిత్ర దర్శకుడు హనీఫ్ తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించబోతున్నారు. మరి తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే, వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. శ్రియా కథానాయికగా, నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈచిత్రానికి ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది ఈ నెలాఖరులో పట్టాలెక్కనుంది. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ చిత్రంలో నటించనున్నారు. అలాగే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనూ ఓ ఆధ్యాత్మిక చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది.ఇటీవల కాస్త గ్యాప్ వచ్చినా ఇలా ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారట.