విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్

మోస్ట్ ఛార్మింగ్ – డాషింగ్ లేడీ పొలిటీషియన్ గా చరిత్రలో నిలిచిపోయిన జయలలిత జీవితం ఆధారంగా విబ్రి మీడియా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
“ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారతీయ రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన ఘనమైన చరిత కలిగిన ఆమె ప్రయాణాన్ని సినిమాగా తెరకిక్కిస్తున్నాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఆమె ఎచీవ్ మెంట్స్ ను ఈ సినిమాలో చూపించనున్నాం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆరోజే చిత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అదేరోజున ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నామని విబ్రి మీడియా డైరెక్టర్ మరియు సైమా అవార్డ్స్ చైర్మన్ బృందాప్రసాద్ అడుసుమిల్లి వెల్లడించారు.
 
“మదరాసుపట్టణం” చిత్రంతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్ తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
“విబ్రి మీడియా నుంచి నిజమైన కథలు, జీవితాలు తెరకెక్కించాలన్నది నా కల. విజయ్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ చూసుకొంటున్నాడు. బాలీవుడ్ మరియు సౌత్ కు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు” అని నిర్మాత విష్ణు ఇందూరి తెలిపారు.
 
గత పదేళ్లుగా అసంఖ్యాక టెలివిజన్ షోస్ నిర్మిస్తున్న విబ్రి మీడియా ఈ ఏడాది వరల్డ్ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో “83” చిత్రాన్ని కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ కీలకపాత్రలో నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంతోపాటు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న “ఎన్.టి.ఆర్” బయోపిక్ , జయలలిత బయోపిక్ కూడా 2019లొనే విడుదలకానుండడం విశేషం.