స్ఫూర్తి నిచ్చే ప్రయత్నం … ‘గురు’ చిత్ర సమీక్ష |
|
సినీవినోదం రేటింగ్ : 3.25/5 వై నాట్ స్టూడియోస్ బ్యానర్ ఫై సుధ కొంగర దర్శకత్వం లో ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఆదిత్య ( వెంకటేష్) దేశం కోసం మెడల్ సాధించాలన్న తపన ఉన్న బాక్సర్. 1996లో వరల్డ్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది, సెలక్షన్ కమిటీ రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ సెలెక్టర్ దేవ్ ఖత్రీ (జకీర్ హుస్సేన్) కావాలనే ఆదిని గేమ్ కు దూరం చేస్తాడు. దీంతో చాలా కాలం పాటు బాక్సింగ్ రింగ్ కు దూరంగా ఉండిపోయిన ఆదిని కొంత కాలం తరువాత ఉమెన్స్ బాక్సింగ్ కోచ్ గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా స్టూడెంట్స్ తో కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. వైజాగ్ చేరుకున్న ఆది, మార్కెట్ లో కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాముడు (రితికా సింగ్) గొడవ పడే వ్యవహారశైలి చూసి ఆమెను బాక్సర్ గా తయారు చేయాలనుకుంటాడు. ఆమె అక్క లక్స్ అలియాస్ లక్ష్మీ (ముంతాజ్ సర్కార్) అప్పటికే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సాధించాలన్న ఆశతో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ ఇద్దరినీ తనతో పాటు తీసుకెళ్లిన ఆది, రాముడిపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపించటం లక్స్ కి నచ్చదు. ఎలాగైన రాముడ్ని తిప్పి పంపేయాలన్న ఆలోచనతో కీలక మ్యాచ్ కు ముందు రాముడి చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. రాముడు కావాలనే ఇలా చేసిందన్న కోపంతో ఆది ఆమెను పంపేస్తాడు.తిరిగి ఇంటికి వచ్చిన రాముడు అక్కడ కూడా ఉండలేక పోతుంది . గురు నుండి దూరమైన ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. బాక్సింగ్ ట్రైనింగ్ ఎలా కొనసాగించింది. చాంపియన్ షిప్ సాధించిందా..? అన్నది చిత్రం లో చూడాలి …. మన తెలుగు మహిళ సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖండూస్’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత తమిళంలో ‘ఇరుద్ది సుట్రు’ గా రీమేకై ఘన విజయం సొంతం చేసుకుంది . ఇప్పుడు తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘గురు’ గా రూపుదిద్దుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకురాలు సుధ కొంగర తొలిచిత్రం గా ఇలాంటి సినిమాను చేయాలనుకోవడం నిజం గా సాహసమే. అందుకు ఆమెను అభినందించాలి . ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాన్ని ఏదో తీసేయాలని కాకుండా, ఒక పద్ధతిలో రీసెర్చ్ చేసి సినిమాను తెరకెక్కించింది. పలువురు బాక్సింగ్ కోచ్‌లు, బాక్సర్స్‌ను కలిసి రాసుకున్న కథ కాబట్టే వాస్తవానికి దగ్గరగా సినిమా ఉంది . దర్శకురాలు ఆరంభం నుండి చివరి దాకా కధకు అనుగుణం గా సినిమాను ఎలాంటి పక్క చూపులు లేకుండా నడిపారు. వెంకీని సరికొత్తగా చూపడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. ప్రధానమైన వెంకీ, రితికా సింగ్ పాత్రల చిత్రీకరణ, గురు శిష్యుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో బాగా పండాయి. హిందీ, తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చూసి ఇన్‌స్పైర్ అయిన వెంకటేష్ తన ఏజ్‌కు తగిన పాత్రను ఎంచుకోవడం విశేషం . వీటితో పాటు సరికొత్త లుక్‌లో వెంకటేష్ సినిమా అంతా సీరియస్ గా కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ పండించాడు. తమిళం, హిందీలో చేయడం వల్ల సునాయాసంగానే రితిక సింగ్ స్లమ్ ఏరియాలోని అమ్మాయి, రామేశ్వరి పాత్ర చేసింది.బాధ్యత లేని అల్లరి అమ్మాయిగా, గెలుపొందడానికి ఎంత కష్టాన్నైనా భరించే సిన్సియర్ ప్లేయర్ గా చాలా బాగా నటించింది. జూనియర్ కోచ్ గా నాజర్, చీఫ్ సెలెక్టర్ జకీర్ హుస్సేన్, రామేశ్వరి అక్కగా ముంతాజ్ సర్కార్, రఘుబాబు, అనితాచౌదరి తదితరులు వారి పాత్ర లు చక్కగా చేశారు. శక్తివేల్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చి ప్లస్ అయ్యింది .సంతోష్ నారాయణన్ సంగీతం, కీలక సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. ‘ఓ సక్కనోడా..సాంగ్’, ‘జింగిడ’… ఇలా పాటలన్నీ నేపధ్యం లోనే సాగుతూ కథలో భాగం కావడం కూడా బాగుంది . హర్షవర్థన్ అందించిన మాటలు వెంకీ పాత్ర స్వభావానికి తగ్గట్టు బాగున్నాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది – రాజేష్ |