సినీ వినోదం రేటింగ్ : 2.5/5
వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో జూలై 20, 2021 న విడుదలయ్యింది.
కధ… ఓ పల్లెటూరిలో ఉండే నారప్ప(వెంకటేశ్).. భార్య సుందరమ్మ(ప్రియమణి), కొడుకులు ముని కన్నా(కార్తీకరత్నం), చిన్నబ్బ(రాఖీ), కూతురు బుజ్జమ్మ(చిత్ర)లతో కలిసి తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటూ హాయిగా కాలం వెళ్లదీస్తుంటాడు. ఆ ఊరి మోతుబరి అయిన పండుసామి(ఆడుగలం నరేన్) సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి చుట్టు పక్కల భూమిని కొంటాడు. అందరూ భూములను ఇచ్చినా తన భూమిని ఇవ్వడానికి నారప్ప ఒప్పుకోడు. పండుసామి అప్పటి నుంచి నారప్ప భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలనుకుంటాడు. అదే సమయంలో జరిగే పొలం తగదాల్లో పండుసామి కుటుంబ సభ్యులకు, నారప్ప కుటుంబ సభ్యులకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ పెద్దదవుతుంది. తండ్రిని అవమానించినందుకు పండుసామిని మునికన్నా కొడతాడు. దాన్ని జీర్ణించుకోలేని పండుసామి, ఆయన కొడుకులు కలిసి ముని కన్నాను హత్య చేస్తారు. అన్నను హత్య చేసినందుకు నారప్ప చిన్న కొడుకు చిన్నబ్బ.. పండుసామిని చంపేస్తాడు. దాంతో పండుసామి కుటుంబం నారప్ప కుటుంబాన్ని చంపాలని వెంబడిస్తుంది. నారప్ప తన భార్య, బిడ్డలతో కలిసి అడవిలోకి వెళ్ళిన నారప్ప తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఏం చేసాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…
సమీక్ష… ధనుశ్, వెట్రిమారన్ కాంబినేషన్లో రూపొందిన తమిళ మూవీ ‘అసురన్’ చాలా పెద్ద విజయాన్ని సాధించింది. రీమేక్ సినిమాలను తెరకెక్కించేటప్పుడు దాని ఆత్మను మిస్ కానీకుండా.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు దాన్ని మార్చిచెయ్యడమనేది కత్తిమీదసామే. సాధారణంగా రీమేక్‌లను తెరకెక్కించే విషయంలో దర్శకులు తమ శైలికి అనుగుణంగా కథలో అనేక మార్పులు చేస్తుంటారు. అయితే ,నారప్ప విషయంలో శ్రీకాంత్ అడ్డాల మార్కు ఎక్కడ కనిపించలేదు. తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు ఎలాంటి మార్పులు చేయలేదు. సీన్ టూ సీన్ తమిళ మాతృకను తెలుగులో కాపీ చేశారు. తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు ఎలాంటి మార్పులు చేయలేదు. ఎమోషన్స్‌ను చక్కగా పండించగల నటీనటులతో చెయ్యడమే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. కొన్ని చోట్ల ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం సరిగ్గా కుదరలేదు. ఆ సన్నివేశాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. పెత్తందారులకు,పేదవాడికి మధ్య అంతరాలను చూపే ఈ తరహా కథలతో తెలుగులో లెక్క లేనన్ని సినిమాలొచ్చాయి. పాత సినిమాలన్నింటిని ఈ చిత్రం గుర్తుకుతెస్తుంది తప్పితే కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఇంటర్వెల్ సన్నివేశాల ముందు వచ్చే పోరాట ఘట్టంతో పాటు పతాక సన్నివేశాలు బాగా చేసారు. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవరూ తీసుకోలేరు’ వంటి కొన్ని సందర్భోచిత సంభాషణలు ఆకట్టుకుంటాయి.
వెంకటేశ్ రెండు షేడ్స్‌లో కనిపించాడు.ఇద్దరు కొడుకులున్న తండ్రి పాత్ర ఒకటైతే.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే యువకుని పాత్ర మరొకటి. ఈ పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శించిన తీరు బాగుంది. యంగ్ లుక్ కంటే ఇద్దరు కొడుకులున్న తండ్రి పాత్రలో వెంకటేశ్ చక్కగా ఒదిగిపోయాడు. తమిళంలో ధనుశ్ అయితే యువకుడైనా మధ్య వయస్కుడిగా కనిపించడం, ఆ పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇక్కడ వెంకటేశ్ విషయంలో అలాంటి థ్రిల్ మిస్ అయ్యింది. యువ వెంకటేశ్ జోడీగా నటించిన అమ్ము అభిరామి అతని పక్క సెట్ కాలేదు. వెంకటేశ్ భార్య సుందరమ్మగా ప్రియమణి సహజ నటనతో ఆకట్టుకున్నది. ఇక నాజర్, రాజీవ్ కనకాల, నరేశ్, రావు రమేశ్, బ్రహ్మాజీ అందరూ చక్కగా చేశారు.
సంగీత దర్శకుడు మణిశర్మ పాటలు పరవాలేదనిపించాయి. థీమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో 1990 దశకం నాటి వాతావరణాన్ని ఆర్ట్ డైరెక్టర్‌తో పాటు కెమెరామెన్ శ్యామ్ కెనాయుడు చక్కగా చూపించాడు – రాజేష్