వెంకటేష్ ‘గురు’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అనంతరం వరుసగా యూత్ స్టార్స్‌తో మల్టీస్టారర్స్ చేస్తున్నారు . ఆయన తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించబోతున్న ‘వెంకీ మామ’(వర్కింగ్ టైటిల్) మీద అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగి చాలా రోజులు అయింది. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. అయితే ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో కలిసి వెంకటేష్ చేస్తున్న ‘ఎఫ్2’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఈ సినిమా పూర్తి చేయడంపైనే పూర్తి దృష్టి పెట్టారు ఈ సీనియర్ స్టార్. మరోవైపు నాగచైతన్య సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమా చేస్తున్నారు.
కాబట్టి ‘వెంకీ మామ’ చిత్రం ఖచ్చితంగా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది తెలియడానికి కొంత సమయం పడుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి రచయితగానే కాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. ఓ పంజాబీ సూపర్ హిట్ మూవీని ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథను రూపొందించడం జరిగింది. దీంతో కోన వెంకట్ ఆ సినిమా రీమేక్ రైట్స్‌ను కొనే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీంతో పాటు నిర్మాత సురేష్‌బాబు ఆమోదం కోసం ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారట. అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతోందని అంటున్నారు. పేరుకు పంజాబీ సినిమా కథే అయినా తెలుగు నేటివిటీకి సరిపోయే విధంగా ఇందులో చాలా అంశాలు ఉన్నాయట. వెంకటేష్, నాగచైతన్యలకు తగ్గట్టుగా ఉండడంతో కోన వెంకట్ ఏరికోరి ఈ కథను తీసుకువచ్చారట. ఇక క్యాచీ టైటిల్‌తో ఇద్దరు హీరోల అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో పంజాబీ మసాలా ఎలా ఉంటుందో చూడాల్సిందే.