బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన సల్మాన్ చిత్రం ‘సుల్తాన్’ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయనే వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. సీనియర్ స్టార్ వెంకటేష్ ‘సుల్తాన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది. ‘సాలా ఖడూస్’ తెలుగు రీమేక్ ‘గురు’లో వెంకటేష్‌కు జోడీగా నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బాక్సర్ రితికా సింగ్ ఈ సినిమాలో అతని సరసన మరోసారి నటించనుంది. ఈ చిత్ర విజయంతో తెలుగులో రితికాకు మంచి పాపులారిటీ వచ్చింది.
ఇక సల్మాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ ఇండియన్ రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. రెజ్లింగ్‌లో ఇండియాకు ఒలింపిక్ మెడల్ తీసుకువచ్చిన ఓ మల్లయోధుడి కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇదే స్టోరీ లైన్‌కు అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ‘గురు’ సినిమా కోసం బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు ‘సుల్తాన్’ రీమేక్ మూవీ కోసం రెజ్లింగ్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ చిత్రంపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.