‘అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ జనరల్ అసెంబ్లీ, సెనెట్ అందించిన లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును తెలుగు చిత్ర పరిశ్రమకు అంకితమిస్తున్నాను’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. తనదైన హాస్యభరిత నటనతో ప్రేక్షకులను రిలాక్స్ అయ్యేలా చేస్తున్నందుకుగాను రాజేంద్రప్రసాద్‌కి న్యూజెర్సీ గవర్నమెంట్ ఈ పురస్కారాన్ని అందజేసింది. గత నెలలో అమెరికాలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ‘కలయిక ఫౌండేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్‌కు చెర్యాల నారాయణ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అతిథిగా విచ్చేసిన రేలంగి నరసింహారావు అమెరికా ప్రభుత్వం అందించిన అవార్డు ప్రశంసాపత్రాన్ని రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, ‘నేను, రాజేంద్రప్రసాద్ కలిసి 35 సినిమాలు చేశాం. రాజేంద్రప్రసాద్ చేయని పాత్రంటూ లేదు. ‘ఎర్రమల్లెలు’ లాంటి సినిమాలు చేసి తర్వాత కామెడీ చిత్రాలు చేశారు. ఆ తర్వాత ‘ఆ నలుగురు’ వంటి భిన్న కథా చిత్రం చేశారు. ఆయన తన నటనతో గుండెలను హత్తుకునేలా చేశారు, కడుపుబ్బా నవ్వుకునేలా చేశారు. అలాంటి వ్యక్తికి ఈ అవార్డు వచ్చిందని తెలిసి ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే నాకు సంబంధించిన విషయాలను రాజేంద్రప్రసాద్‌కి, తన విషయాలను నాతో పంచుకుంటూ ఆనందిస్తాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇదొక గర్వకారణం’ అని అన్నారు.
‘రాజేంద్రప్రసాద్‌కు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఆయన ఓ ఫాదర్‌లా ‘మహానటి’ చిత్రానికి వెనకాల ఉండి నడిపించారు. ఆయన సూపర్ టాలెంటెడ్ పర్సన్’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు.
మరో దర్శకుడు సతీష్ వెగేష్న చెబుతూ, ‘రాజేంద్రప్రసాద్ నాకు గురువు. ఎందుకంటే నేను రైటర్‌గా, డైరెక్టర్‌గా మారడానికి ఆయన నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రమే కారణం. ‘శ్రీనివాస కళ్యాణం’లో ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం కలిగింది. ఆయన గురించి మాట్లాడే అవకాశం రావడం నా లైఫ్ ఎచీవ్మెంట్. ఆయన స్థానం ప్రేక్షకుల పెదాల నవ్వుల్లో ఉంటుంది’ అని చెప్పారు.
‘నేను నా సినిమాల ద్వారా ఎంతో కొంత నవ్వించడానికి రాజేంద్రప్రసాద్ కారణం. ఆయన నవ కిరీటి. నవ రసాలు పండించగలరు. ఇంకో యాభై ఏండ్ల తర్వాత అయినా అప్పటికి తగ్గట్టుగా అప్డేట్ అయి నటించగల సమర్థుడాయన. హాస్యానికి బోన్లాంటివారు’ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.
నందినిరెడ్డి చెబుతూ, ‘చిన్నప్పుడు ఏ మాత్రం టెన్షన్‌గా అనిపించినా, మనసు బాగా లేకపోయినా రాజేంద్రప్రసాద్ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సినిమాలు చూసేవాళ్ళం. అలా ఆయన నాకు బాల్యస్నేహితుడయ్యారు’ అని నందినిరెడ్డి చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘నాలుగు దశాబ్దాలుగా నన్ను భరించిన దర్శకులకు సెల్యూట్ చేస్తున్నా. ఇప్పటి జెనరేషన్ హీరోల చిత్రాల్లో కూడా నాకు పాత్రలు రాస్తూ, నన్ను బలవంతంగా నటించేలా చేస్తున్నారు(నవ్వుతూ). అది నాకు దక్కిన అదృష్టం. నేను నిత్యం నటనకు సంబంధించి ఏదో ఒకటి గమనిస్తూ, ప్రాక్టీస్ చేస్తుంటాను. అయితే ఇండస్ట్రీ లో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన నన్ను మీడియా ప్రోత్సహిస్తూ ఇంత వాడిని చేసింది. ఇలాంటి గౌరవాలు భుజం తట్టి ఇంకా పనిచేయడానికి ప్రోత్సహాన్నిస్తాయి. ఇటీవల ఇండస్ట్రీలో పలు నెగటివ్ సంఘటనలు జరుగుతున్నాయి. కానీ సినిమా పరిశ్రమ ఉన్నది ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికే. దాన్ని పాజిటివ్‌గా చూడాలని కోరుకుంటున్నా. మా అమ్మ నా ఏడాది వయసులోనే చనిపోయింది. నాకు దేవుడి కంటే అమ్మే ఎక్కువ. మదర్స్‌డే సందర్భంగా అమ్మలందరికీ శుభాకాంక్షలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ చెప్పాల, బందరు బాబీ, కాదంబరికిరణ్ తదితరులు పాల్గొని రాజేంద్రప్రసాద్ హాస్యనట ప్రస్థానాన్ని, ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు.