పద్మనాయక ప్రొడక్షన్స్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `ఉద్యమ సింహం`. నటరాజన్ (కరాటే రాజా) కేసీఆర్ పాత్రలో నటిస్తున్నారు. సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దిలీప్ బండారి సంగీతం అందిచారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. కరాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్కరించారు. నటుడు రవివర్మ టీజర్ రిలీజ్ చేసారు.
అనంతరం కరాటే రాజా మాట్లాడుతూ, ` కరాటే రాజా అనే పేరు కమల్ హాసన్ గారు పెట్టారు. అప్పటి నుంచి ఇండస్ర్టీలో అంతా ఆ పేరుతోనే ఎక్కువగా పిలుస్తారు. నటరాజన్ అనే పేరు కన్నాఆ పేరు తోనే బాగా పాపులర్ అయ్యాను. సినిమా విషయానికి వస్తే..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో `బంగారం` సినిమాలో నటించాను. మళ్లీ ఇప్పుడు `ఉద్యమ సింహం`లో నటించే అవకాశం దక్కింది. ఇది నాకు ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేసాను. కానీ ఉద్యమ సింహం వాటికి భిన్నంగా, కొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప పాత్ర. నా మీద నమ్మకంతో దర్శక, నిర్మాతలు నాకు ఆ అవకాశం కల్పించారు. అందుకు వాళ్లిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. పాటలు , సినిమా బాగా వచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
నటుడు రవివర్మ మాట్లాడుతూ, `ఇందులో నేను చిన్న పాత్ర పోషించా. ఆ రోల్ బాగా ఎలివేట్ అవుతుంది. ఉద్యమ సింహం అనేది చాలా మంది తెలంగాణ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది తెలుగు ప్రేక్షకులందరి సినిమా. ఖైలాష్ కేర్, వందేమాతరం శ్రీనివాస్ వంటి గొప్ప సింగర్లు సినిమాలో పాటలో పాడారు. పెళ్లి సాంగ్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమాతో దిలీప్ బండారి తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. టీజర్ బాగుంది. ఉద్యమం ఊపు ప్రచార చిత్రాల్లో బాగా కనిపిస్తుంది. సినిమా అనుకున్న విధంగా మంచి అవుట్ పుట్ వచ్చింది. తెలుగు సినిమా, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమ సింహం ఉంటుంది` అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ` కేసీఆర్ గారంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన కథను వీళ్లంతా ఓ టీమ్ గా ఏర్పాటై చేయడం చాలా సంతోషంగా ఉంది. నాలుగు పాటలు, ఫైట్లు, హీరోయిన్ పెట్టుకుని కమర్శియల్ సినిమా చేసి డబ్బులు వచ్చేలా సినిమా చెయ్యొచ్చు. కానీ నిర్మాత కేసీఆర్ పై అభిమానంతో ఇష్టంతో సినిమా చేయడం గొప్ప విషయం. ఇలాంటి ఉద్యమనేత సినిమా యువతలో స్ఫూర్తిని నింపుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ చూసాను. అందులో టీమ్ అందరి డెడికేషన్, కమిట్ మెంట్ కనిపిస్తోంది. నటరాజన్ గారు కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యానికి పక్కాగా సరిపోయారు. ఆ మధ్య సినిమా సెట్ చూసాను. టీఆర్ ఎస్ భవన్ లా అద్భుతంగా డిజైన్ చేసారు. సినిమా ను బాగా ప్రమోట్ చేసి పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలి` అని అన్నారు.
సంగీత దర్శకుడు దిలీప్ బండారి మాట్లాడుతూ, ` సినిమాలో ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా, యువతలో స్ఫూర్తిని రగిలించేలా ఉంటుంది. పాటలన్నీ సిచ్వేషనల్ గా ఉంటాయి. అసందర్భం గా ఏ పాట ఉండదు. ఖైలాశ్ ఖేర్, వందేమాతరం లాంటి గొప్ప సింగర్లు పాటలు పాడటంతో మా సినిమా స్థాయి కూడా మారింది. ఇలాంటి సినిమాకు సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ` కమర్శియల్ సినిమాలు చేయడం సులభమే. కానీ బయోపిక్ లు, ఉద్యమాల మీద సినిమాలు చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎంతో కమిట్ మెంట్, డెడికేషన్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు చేయలేరు. ఉద్యమ సింహం టీమ్ అందరిలో కసి కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమా చేసారు. కేసీఆర్ గురించి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ` కేసీఆర్ కథని సినిమాగా చేయడం కష్టం. ఆయన గురించి ఎంతో కథ ఉంది. మూడు గంటల్లో చెప్పేది కాదు. 1000 ఎపిసోడ్లలో ముగించేసేది కాదు. అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను, ఉద్యమానికి సంబంధించిన ఎక్కువ పాయింట్లను తీసుకుని ఓ కథలా రాసుకున్నాను. వీలైనంత వరకూ కవర్ చేయగలిగాను. మంచి సందేశాత్మక సినిమా అవుతుంది. యువతలో స్ఫూర్తిని రగిలించే సినిమాగా మిగిలిపోతుంది. ఓ లక్ష్యాన్ని తలపెట్టినప్పుడు దాన్ని చేధించడానికి మధ్యలో ఎదురయ్యే అవరోధాలు? వాటిని దాటుకుని తన గోల్ ను ఎలా రీచ్ అయ్యారు? అన్నదే సింపుల్ గా సినిమా పాయింట్. ఇక మా సినిమాకు జెమీడియా కూడా ఎంతో సహకరించింది. మాది చిన్న సినిమా అనగానే నరేందర్ గారు మంచి మనసుతో ముందుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఈనెలాఖరున సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తాం` అని అన్నారు.
చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ` మంచి కథ ఇది. తెలుగు ప్రేక్షకులంతా కేసీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాత ,నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మారు కాబట్టే సినిమా చేయగలిగాను. నా డైరెక్షన్ టీమ్ నాకన్నా ఎక్కువగా కష్టపడింది. అందుకే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు.
ఇందులో కవితగారి పాత్ర పోషించాను. నా మనసుకు బాగా దగ్గరైన రోల్ అది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని నటి లత అన్నారు. లగడపాటి రాజగోపాల్ పాత్ర పోషించాను. ఆయన ఫీచర్స్ నాలో ఉన్నాయనే టీమ్ నన్ను ఎంపిక చేసి అవకాశం కల్పించారని నటుడు గోపాల కృష్ణ తెలిపారు.
ఈ వేడుకలో వినయ్ ప్రకాశ్, జలగం సుధీర్, పి.ఆర్ విట్టల్ బాబు, ఎన్. హెచ్.పి. విట్టల్ బాబు, లత, సాహిత్య ప్రకాశ్, కృష్ణ రాపోలు, రాములు, గణేష్, సహ నిర్మాత మేకారాఘవేంద్ర, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.