కథ ఒకటే కానీ..సినిమాలు మాత్రం రెండు. ఒకటి బాలీవుడ్‌లోనూ, మరొకటి ఇండో-బ్రిటీష్ చిత్రంగానూ రూపొందుతున్నాయి. రెండు మూడు వారాల వ్యవధిలోనే ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం మరో విశేషం. ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి గడగడలాడించిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథే ఈ రెండు చిత్రాల నేపథ్యం. ఇలా ఒకే కథను రెండు చిత్రాలుగా తీసిన సందర్భాలు తెలుగు చిత్రసీమలో కూడా ఉన్నాయి. ‘దానవీర శూరకర్ణ’, ‘కురుక్షేత్రం’…ఈ రెండు ఒకే కథతో రూపొంది సంక్రాంతికి విడుదలయ్యాయి. అది అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు బాలీవుడ్లో ఇదే పరిస్థితి ఎదురు కానుంది. కాకపోతే రెండూ బాలీవుడ్లో రూపొందకపోయినా ఇండో -బ్రిటీష్ సినిమాను కూడా హిందీలో విడుదల చేయబోతున్నారు.
సామాజిక సందేశంతో ‘కంచె’ను రూపొందించిన జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఝాన్సీలక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో ‘మణికర్ణిక’ పేరుతో 125 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమంలో లీకయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా అంచనాలు కూడా పెంచేసింది. జీ స్టూడియో ‘మణికర్ణిక’ను నిర్మిస్తుంది. అతుల్ కులకర్ణి, సోనూసూద్, జిష్సు సేన్‌గుప్తా, అంకిత లోకనాథ్, వైభవ్ తత్వవాది తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా ఇండో- బ్రిటీష్ చిత్రం ‘స్వర్డ్ అండ్ సెటర్’ రానుంది. దీన్ని ‘మణికర్ణిక’కు రెండు మూడు వారాల ముందే ప్రేక్షలకు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ దశలో ఉంది. ఝాన్సీ బ్రిటీష్ వారితో పోరాటానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. యుద్ధ సన్నివేశాల కోసం స్పెషల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నారు. ఈ పనులు ఈనెలలో పూర్తయిపోతే మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి స్వాతి భిషే దర్శకత్వం వహిస్తున్నారు. దేవిక భిషే ఝాన్సీ లక్ష్మీబాయిగా కనిపించనుంది. జోధి మే విక్టోరి మహారాణి పాత్రను చేస్తుంది. కెయన్నే పెప్పర్ ప్రొడక్షన్, దునే ఫిల్మ్స్, శివ శక్తి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి.