టి.ఎస్.ఆర్ – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్… కు విశాఖ పట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010 నుండీ రెండేళ్ళకు ఒకసారి కళాబంధు, సాంస్కృతిక సార్వభౌమ టి. సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017, 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుబోతున్నట్టు శనివారం టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితో పాటు సభ్యులు డా. శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కె.ఎస్. రామారావు పాల్గొన్నారు. వీరితో పాటుగా జీవిత, కె. రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ, ‘2010లో మొదలు పెట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందని, ఈశ్వర శక్తి, ప్రజల ప్రేమతో ఇది సాధ్యమౌతోంద’ని అన్నారు. శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారని అన్నారు.
నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే ఈ కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక చేస్తుందని నరేశ్ తెలిపారు.
తెలుగు చిత్రసీమకు చెందిన అనేక మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి టి. సుబ్బరామిరెడ్డి కారకులని కె.యస్. రామారావు చెప్పారు.
భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు.
గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని అభిప్రాయపడ్డారు.
తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని పింకీ రెడ్డి చెప్పారు.