ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ శుక్రవారం ఉదయం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఓంప్రకాశ్ నారాయణ వడ్డి రూపొందించిన ‘ఓనావ కార్టూన్లు’ పుస్తకాన్ని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు.
సీనియర్ జర్నలిస్ట్ ఓంప్రకాశ్ ‘ఓనావ’ పేరుతో వివిధ పత్రికల్లో పలు కార్టూన్లు గీశారు. వాటిని ‘ఓనావ కార్టూన్లు’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించి తొలి కాపీని ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్లకు అందించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, ‘బేసికల్ గా కార్టూనిస్టులందరూ కోపిస్టులై ఉంటారని నా నమ్మకం. సమాజంలోని రకరకాల విషయాలపై ఉన్న కోపాన్ని నవ్వు ద్వారా వ్యక్త పరుస్తుంటారు. తీవ్రవాదులైతే తుపాకులు పట్టుకుంటారు. వీరు మాత్రం కుంచె, కలం పట్టుకుని కార్టూన్లు గీస్తారు. అందువల్ల వీళ్ళు సేఫ్. పుస్తకాన్ని ప్రజలలోకి తీసుకొచ్చే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఈ పుస్తకాన్ని ప్రచురించిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిభొట్ల గారికి నా అభినందనలు. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఓంప్రకాశ్ నారాయణ గీసిన పలు కార్టూన్లు ఫేస్ బుక్ లో చూసి ఎంతో ఆనందించే వాడినని, వాటిని పుస్తక రూపంలో తీసుకురావాలనే ఆయన కోరికను ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ద్వారా నెరవేర్చడం ఆనందంగా ఉందని వివేక్ కూచిభొట్ల అన్నారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కు, ఆవిష్కర్త త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓంప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాన్ని తన గురుతుల్యులు, స్వర్గీయ వడ్లమూడి రామ్మోహనరావు గారికి అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగభైరు సుబ్బారావు, ప్రసన్న ప్రదీప్, రెంటాల జయదేవ, ఎల్. వేణుగోపాల్, జై సింహా తదితరులు పాల్గొన్నారు.