నాకు కాబోయే భర్త ఎర్రగానో, తెల్లగానో ఉండాలన్న కోరికలేమీ లేవు. ఇంకా చెప్పాలంటే నాకు నలుపంటేనే చాలా ఇష్టం. తెల్లగా ఉంటేనే అందం అని అనుకోను. నలుపురంగూ అందమే…అని అంటోంది త్రిష. కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి జరగాల్సి ఉంది. వరుణ్ మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం కూడా అయింది.అయితే కారణం ఏంటో తెలియదు కానీ వారి బంధం నిశ్చితార్థంతోనే ముగిసిపోయింది. పెళ్లి రద్దు కావడంతో హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయ్యేందుకు త్రిష ప్రయత్నించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరోసారి పెళ్లి గురించి మాట్లాడింది….
“భారతీయ పెళ్లి సంప్రదాయాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా ప్రేమ వివాహం చేసుకుంటాను.అయితే నాకిప్పటి వరకూ ప్రేమ పుట్టలేదు. ఇప్పటివరకు నా మనసుకు నచ్చినవాడు, నాకు సరైనోడు దొరకలేదు. ఆ సరైనోడి కోసం ఎదురుచూస్తున్నాను.నా మనసుకు నచ్చిన వాడిని కలిస్తే, ఆయనపై నాకు, నాపై తనకూ ప్రేమ పుడితే అది ఈ రోజైనా, రేపైనా పెళ్లి చేసుకుంటాను.” అని త్రిష పేర్కొంది.
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. త్రిష తాజాగా రజనీకాంత్‌తో ‘పెట్ట’ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించినా కూడా త్రిషకు పెద్దగా క్రేజ్‌ను తీసుకురాలేకపోయింది. దీంతో ఈ అమ్మడి మనసు పెళ్లిపైకి మళ్లినట్లుగా అనిపిస్తోంది.
ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగాలి !
మాస్ కథానాయకులకు జంటగా నటిస్తేనే మాస్ కథానాయికలుగా పేరు తెచ్చుకుంటారు. అలా నేను చాలా చిత్రాల్లో నటించాను. ఇక హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథా పాత్రలు ఇప్పుడే రావడం ప్రారంభించాయి. అవి విజయం సాధించిన తరువాత అటువంటి పాత్రల గురించి ఆలోచిద్దాం. ’96’ చిత్రం సక్సెస్ తరువాత ప్రేమ కథా చిత్రాల అవకాశాలు చాలా వస్తున్నాయి. చిత్రం చూసి ఇంటికి వెళ్లిన తరువాత ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగాలి. అలాంటి కథా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నాను…అని అంటోంది త్రిష