లేడీ ఓరియంటెడ్‌ సినిమాల సూపర్‌ లేడీ

త్రిష చేతిలో ఉన్నవన్నీ ఇప్పుడు దాదాపు ‘లేడీ ఓరియంటెడ్‌’ సినిమాలే. మామూలుగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే అందులో నటించే నాయికకు థియేటర్స్‌కి జనాలను రాబట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే హీరోయిన్‌గా తీసుకుంటారు. ‘త్రిష సూపర్‌ లేడీ’ అని ఆమెను లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు తీసుకుంటున్నారు కోలీవుడ్‌ దర్శక–నిర్మాతలు. ఇటీవలే ‘పరమ పదమ్‌ విళయాట్టు’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాని పూర్తి చేశారామె. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది.
అలాగే మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ చిత్రీకరణ జరుగుతోంది.సుమం రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్‌ మరో నాయికగా నటిస్తున్నారు. తాజాగా మరో కథానాయికగా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు త్రిష. ‘ఎంగేయుమ్‌ ఎప్పోద్దుమ్‌’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్‌ ఎమ్‌. శర్వణన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే హిందీ హిట్‌ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటిస్తారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు త్రిష నటించిన చతురంగవేట2, 18 రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా వరుస లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తూ త్రిష సూపర్‌ లేడీ అనిపించుకున్నారు. అంతేగా మరి… ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు దాటినప్పటికీ ఇన్ని సినిమాలు చేతిలో ఉండటం అంటే సూపరే మరి.
అలాంటోడు కలిస్తే రేపే పెళ్లి
త్రిష నటిగా 15 ఏళ్ల అనుభవాన్ని సంపాయించింది . అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ హీరోయిన్ల సరసన చేరింది. స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. నటుడు శింబు, ఆర్య వంటి నటులు చాలా లైక్‌ చేసే నటి త్రిష. టాలీవుడ్‌ నటుడు రానాతో ప్రేమాయణం అనే ప్రచారం కాస్తా ఎక్కువగానే సాగింది.వీరిద్దరిని కలిపి పెళ్లి చేస్తానని నటుడు ప్రభాస్‌ ఈ మధ్య ఒక రియాలిటీ షోలో బహిరంగంగానే రానా సమక్షంలో అన్నాడు. మరి ఆ ప్రయత్నం ఎంత వరకూ వచ్చిందో తెలియదు. కాగా నటిగా దక్షిణాదిలో రాణించిన త్రిష అదే జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించాలని ఆశించినా అది సాధ్యం కాలేదు. ఒక్క చిత్రంతోనే అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం తమిళంలోనే ఈ అమ్మడికి ఆశాజనకంగా ఉంది.
 
ప్రేమ వ్యవహారంలోనూ చాలా వదంతులను ఎదుర్కొన్న త్రిషకు ఒక తరుణంలో పెళ్లి పీటల దరిదాపులకు వెళ్లే పరిస్థితి వచ్చినా, అది నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. అవును.. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో త్రిష ప్రేమ పెళ్లికి నిశ్చితార్థం వరకూ వచ్చి ఆగిపోయిన విషయం ఆ మధ్య చర్చనీయాంశమైంది.అయితే, పెళ్లి తంతుపై తనకు నమ్మకం ఉందని మాత్రం త్రిష చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది… తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతానికి తానెవరినీ ప్రేమించడం లేదని, అదేవిధంగా సరైనోడు ఇంకా తారసపడలేదని చెప్పింది. అలాంటోడు కలిస్తే రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని త్రిష అంది.