ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా రాణించిన త్రిష ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. అదే సమయంలో జంతువులపై తనకున్న ప్రేమను చాటడంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో త్రిష తాజాగా యునిసెఫ్ ప్రచారకర్తగా ఎంపికైంది. చెన్నైలో యునిసెఫ్ ప్రచారకర్తగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాలల హక్కులపై తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్రిష అవగాహన కల్పించనున్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా తమిళనాడు, కేరళ యునిసెఫ్ చీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘సమాజంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వెలుగులోకి తెచ్చే నేర్పు, నైపుణ్యం త్రిషకు ఉంది. విద్యాభివృద్ధి, ఆరోగ్యం, సమాజంలో బాలికల ప్రాధాన్యత గురించి త్రిష అవగాహన కల్పిస్తారు’ అని చెప్పారు.
ఈ సందర్భంగా త్రిష స్పందిస్తూ… ‘నా కొత్త ప్రయాణం మొదలైంది. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా బాధ్యతలు స్వీకరించా. కేరళలో బాలల ఆరోగ్యం, విద్య, పోషకాహారం, రక్షణపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను’ అని ట్వీట్ ద్వారా అభిమానులతో ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
త్రిష ప్రస్తుతం అరడజన్ కి పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిల్లో దాదాపు మూడు చిత్రాలు హర్రర్ నేపథ్యంలో ఉండటం విశేషం. గతంలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన త్రిష ఈ మధ్యకాలంలో పంథా మార్చి మహిళా ప్రధాన చిత్రాలు, పాత్రలకు ప్రయారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా నూతనంగా అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్ని ఈ కోవలోనే ఉంటాయట.
హర్రర్ ప్రధాన చిత్రాల్లో నటించడానికి గల కారణం గురించి త్రిష వివరిస్తూ… ‘చాలా మంది దెయ్యాల్ని చూసి మేం భయపడ్డామని చెబుతారు. కాని నాకు అలా ఏమీ ఉండదు. వీలుంటే వాటితో డేటింగ్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నాను. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘మోహిని’. ఇందులో కథ మొత్తం దెయ్యం చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను భయపెడతాను. దేవుడు, దెయ్యం అంశాల నేపథ్యంలో ఈచిత్రం ఉంటుంది’ అని తెలిపింది.