టాలీవుడ్ డ్రగ్స్ కేసు మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్లో హీరోలు, దర్శకులు లాంటి ఎంతో మంది ప్రముఖులను ఎక్సైజ్ పోలీసులు విచారించడం అప్పట్లో ఈ కేసు తీవ్ర దుమారమే రేపింది. ఆ కేసులో పూర్తి దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కానీ, ఆ తరవాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్ లేదు. దీంతో ఇక ఆ కేసు మరుగున పడినట్టే అని అంతా భావించారు. కానీ, ఆ కేసుకు సంబంధించి ఛార్జిషీట్లు సిద్ధం చేశామని.. 72 మంది శాంపిల్స్ ల్యాబ్‌కు పంపామని విచారణాధికారి వివేకానంద రెడ్డి చెబుతున్నారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అధికారిగా ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వ్యవహరిస్తున్నారు.
మొత్తం 12 కేసుల్లో 8 కేసులకు వివేకానందరెడ్డి ఛార్జిషీట్లు దాఖలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల డ్రగ్స్ వ్యహారంపై వివేకానందరెడ్డి మాట్లాడుతూ…12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్‌ను సేకరించామని వివేకానందరెడ్డి చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల శాంపిల్స్‌ను కూడా పరీక్షలకు పంపామన్నారు.కొంతమంది టాలీవుడ్ నటులు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారని వివేకానందరెడ్డి చెప్పారు. శాంపిల్ ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ పొందిన వారి పేర్లను ఛార్జిషీట్లో పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కొంత మంది నటులు పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ తీసుకోలేదని.. వారి పేర్లను ఛార్జిషీట్లో పొందుపరిచామని తెలిపారు. ఛార్జిషీట్లో ఉన్న వారికి ఏడాది నుంచి రెండు సంవత్సరాల శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
మొత్తం 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచామని వివేకానంద రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి సంచలన ఆరోపణలు చేశారు వివేకానంద. టాలీవుడ్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇప్పటికే తీసుకుందని చెప్పారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి ఈ కేసులో NCB ముందుకు వెళ్తుందన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్మెంట్ వీడియో రికార్డింగ్ చేశామని తెలిపారు.ఇంకా నాలుగు కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతోందని వివేకానందరెడ్డి వెల్లడించారు.