‘బాహుబలి’ స్ఫూర్తి తో ఇండియన్ స్క్రీన్ మీద రాబోతున్న మరో భారీచిత్రం ‘రండామూళం’. అతి పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు జతకూరుతున్నాయి. ‘బాహుబలి’ ఇండియన్ సినిమా గతినే మార్చేసి బడ్జెట్ పరిమితుల్ని చెరిపేసింది. ఈ సినిమా స్ఫూర్తి తో బడ్జెట్లో సినిమాలు నిర్మించే మల్లూవుడ్ ఇప్పుడు తన స్టైల్‌కు భిన్నంగా వెళుతోంది. మోహన్ లాల్ హీరోగా శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ‘రండామూళం’ అనే పౌరాణిక చిత్రం దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోందట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కూడా ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కనుందట. ఈ సినిమా ప్రదర్శనా సమయం దాదాపు 5గంటల 20 నిమిషాలట. అందుకే దీన్ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారట దర్శక, నిర్మాతలు.
యమ్.టి.వాసుదేవ నాయర్ రచించిన ‘రండామూళం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ‘మహాభారతం’లోని ఓ ఘట్టం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం భీముని ధృక్కోణంలో సాగుతుందట. పాండవులు హిమాలయాలకు వెళ్లే సన్నివేశంతో ఈ చిత్రం మొదలుకానుంది. దాదాపు భారతీయ నటీనటులందరూ ఈ సినిమాలో పాత్రధారులు కానున్నారు. మోహన్ లాల్ భీముడు పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మొదటిభాగం 2020లో విడుదల అవుతుంది. ఆ తర్వాత 4 నెలల వ్యవధితో రెండో భాగం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా ఆరంభాన్ని భారీ ఎత్తున వేడుకగా చేయబోతున్నారు.