హీరో విజయ్‌కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానులున్న నటుడు విజయ్. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని రెండేళ్లుగా అంతా అనుకుంటూనే ఉన్నారు. ఆమధ్య విజయ్ తండ్రి, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్ఏ చంద్రశేఖరన్ విజయ్ పేరుతో ఓ పార్టీ ప్రకటించి.. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం దరఖాస్తు చేసారు. దాంతో దళపతి రాజకీయ అరంగేట్రం ఖాయమైందని అంతా అనుకున్నారు. మరుసటిరోజే విజయ్ స్పందించి.. ‘అబ్బే అటువంటిదేంలేద’ని తేల్చిచెప్పాడు. తన తండ్రి పెట్టిన పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ కూడా ఇచ్చాడు. తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ సభ్యులెవరూ తన తండ్రి ప్రకటించిన పార్టీలో చేరవద్దని చెప్పాడు. దీంతో విజయ్ ఇక రాజకీయాల్లోకి రాడని అందరూ అనుకున్నారు.
కొద్దిరోజుల క్రితం మక్కళ్ ఇయక్కమ్ కార్యదర్శులతో విజయ్ అనధికారికంగా సమావేశమయ్యారు. తొందరపడి ఎవరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. మరే ఇతర రాజకీయ పార్టీలోనూ చేరవద్దని చెప్పారు. అందరూ ఎదురుచూస్తున్న క్షణం త్వరలోనే వస్తుందని.. తన నుంచి మంచి ప్రకటన వెలువడుతుందని విజయ్ ప్రకటించాడు. ఒకరకంగా ఇది తన రాజకీయ ప్రవేశంపై తమిళనాడు ప్రజానీకానికి విజయ్ ఇచ్చిన ఒక స్పష్టమైన సంకేతంగా భావించాలి. ఈ ప్రకటన తర్వాత దళపతి రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు.
రజనీ, ఇటు కమల్ హాసన్.. మరోపక్క డీఎంకే ప్రభంజనం.. ఇన్నింటి మధ్య విజయ్ పరిస్థితి ఏమిటనే సందేహం ఫాన్స్‌లో ఉంది. ఇప్పుడు విజయ్ అభిమానులు ఆనందపడేలా రజనీ రూట్ క్లియర్ చేశారు. దాంతో ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది.
రహస్యంగా ముఖ్యమంత్రితో విజయ్ భేటీ !.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా.. తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అనుమతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందంలో ఉంది. మాస్టర్ చిత్రాన్ని రూ. 143 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్‌కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా గతంలో విజయ్ నటించిన అనేక చిత్రాలు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగానే సీఎంతో విజయ్ భేటీ కావడం గమనార్హం.అయితే, ఎన్నికల సమయంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, మాస్టర్ సినిమా రిలీజ్‌పై మాట్లాడటానికే విజయ్ సీఎంను కలిశారని సమాచారం.