దాడులు చేసారు… క్లీన్‌ చిట్‌ ఇచ్చేసారు!

తమిళంలో రజనీకాంత్ తో పోటీపడే హీరో విజయ్‌ ‘విజిల్’ చిత్రంలో నటించినందుకు గాను 50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న ‘మాస్టర్‌’ చిత్రానికి 80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి నటుడు విజయ్‌ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ‘విజిల్’ చిత్ర వ్యవహారంలో ఫిబ్రవరి 5,6 న విజయ్‌కు చెందిన స్థానిక సాలిగ్రామం, పనైయూర్‌లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత విజయ్‌కు సమన్లు పంపడంతో ..ఆయన నేరుగా చెన్నైలోని ఆదాయపన్నుశాఖాధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. తాజాగా మరోసారి ఆదాయపన్నుశాఖ దాడి… ఈ గురువారం మరోసారి విజయ్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్‌ తాజాగా నటిస్తున్న ‘మాస్టర్‌’ చిత్ర సహ నిర్మాత లలిత్‌కుమార్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
విజయ్‌ ‘విజిల్’ చిత్రంలో నటించినందుకు గాను రూ.50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న ‘మాస్టర్‌’ చిత్రానికి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తేలింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి విజయ్‌ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చారు. విజయ్‌ ని ‘మిస్టర్‌ క్లీన్‌’ చేశారు. ఈ ఐటీ దాడుల వ్యవహారంలో విజయ్‌ ప్రవర్తించిన విధానం అతని పరిణితిని తెలియజేసింది. ఈ దాడుల గురించి విజయ్‌ ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు.
 
‘ఇళయదళపతి’ వారికి టార్గెట్‌ అయ్యారా?
విజయ్‌ను ఈమధ్య అన్నాడీఎంకే పార్టీ  టార్గెట్‌ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. విజయ్‌ నటించిన ‘తలైవా’, ‘కత్తి’ చిత్రాల విడుదల నుంచి.. ఆ మధ్య తెరపైకి వచ్చిన ‘సర్కార్’, ఇటీవల ‘విజిల్’ చిత్ర ఆడియో ఆవిష్కరణ వరకూ అన్నాడీఎంకే ఆయనను టార్గెట్‌ చేసిందని అంటున్నారు.’మెర్సెల్‌’ చిత్రం విడుదల సమయంలోనూ బీజేపీ నాయకులు ఆ సినిమాను టార్గెట్‌ చేస్తూ.. చిత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు.
 ఐటీ అధికారులు విజయ్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో విజయ్‌ తన పనిని తాను కామ్‌గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్టర్‌’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదల సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో? అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
‘మాస్టర్’ అంచనాలు మించిపోయాయి!
“విజిల్” సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. తాజాగా ‘మాస్టర్’ చిత్రం తెలుగు ఫస్ట్ లుక్ రిలీజైంది. ‘ఖైదీ’ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ‘మాస్టర్’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘మాస్టర్’ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడంతో అంచనాలు మించిపోయాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవిక మోహనన్, ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు.  ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం.