` మత్తులో తేల్తోంది ఆ పది మందే కావచ్చు.అలాంటి వాళ్ల వల్ల మొత్తం ఇండస్ట్రీ కే చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆ ప్రభావం మిగతా వారిపై కూడా పడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది. వాళ్లంతా తక్షణం మత్తు నుంచి బయటకు రావాలి. ఈ విషయాలేవి బయటకు తెలియవని వారు అనుకుంటున్నారు . కానీ ప్రభుత్వం..సినిమా ఇండస్ట్రీ దీనిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. అలాంటి వాళ్లంతా వెంటనే మత్తును వీడి బయటకు రావాలి. లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని` నిర్మాత అల్లు అరవింద్ హెచ్చరించారు. ఇటీవలే టాలీవుడ్ లో కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా “తెలుగు సినిమా ఫిలిం ఛాంబర్” తరఫున అరవింద్ పై విధంగా స్పందించారు….
అల్లు అరవింద్ మాట్లాడుతూ… ` ముంబై నుంచి ఈ కల్చర్ మన ఇండస్ట్రీకి పాకింది. రేవ్ పార్టీలో ఒకరిద్దరు సపరేట్ అయి… మిగతా వారిని వారిపట్ల ఆకర్షితులను చేయడం జరుగుతుంది. టేస్ట్ కోసం వెళ్లినా తర్వాత డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ‘కళ్లు మూసుకుని పాలు తాగుతున్నాం’ అనే భ్రమలో ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీని వల్ల వాళ్ల ఆరోగ్యంతో పాటు..కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి వాళ్లకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి. ప్రభుత్వం వాళ్లను శిక్షించాలని భావించలేదు. మత్తు నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలాంటి వాళ్లందరికీ ఎవరు పంపిణీ చేస్తున్నారన్న దానిపై మాత్రం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. దయచేసి ఇలాంటి వాళ్లంతా చెడును వీడి మంచి మార్గంలో కి రావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ… `డ్రగ్స్ సోసైటీకి హానికరం. ఇలాంటి మార్గంలో వెళ్లే వాళ్ళకు అవగాహన కల్పించాలి. తెలుగు సినిమారంగం లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఆ వాతావరణం చెడపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది` అని అన్నారు.
`మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ…` ఎవరికైనా కష్టం వస్తే..వాళ్ల బాధలను పంచుకోవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో చేస్తున్నదే. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన డ్రగ్ మహమ్మారిని కూడా మన దగ్గర నుంచి తరిమేయాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ వి.కె. నరేష్, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ పాల్గొన్నారు.