శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది, శ్రీ రామ నవమి వేడుకలు చికాగో మహా నగర తెలుగు సంస్థ( టీఏజీసీ) ఆధ్వర్యంలో యెల్లో బాక్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక భారత దౌత్య కార్యాలయ అధికారి ఓ.పీ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు స్థానిక ప్రముఖులతోపాటూ భారీగా ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని టీఏజీసీ ఈ సంబరాల ద్వారా దగ్గర చేసింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే సంస్కృతిక, సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి కార్యక్రమాలను గణపతి ప్రార్ధనతో ప్రారంభించారు. తెలుగు జాతి, మన సంస్కృతి, సంప్రదాయాలు వాటి ఔన్నత్యాన్ని ఆయన కొనియాడారు. అతిథులకు ఉగాది, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
సంస్కృతిక కమిటి కార్యదర్శి సుజాత కట్ట, కో-ఛైర్మన్ ప్రవీణ్ వేములపల్లి 321 మంది కళాకారులతో పలు కార్యాక్రామాలను రూపొందించారు. శ్రీ రాముని ఉద్దేశించిన పలు పాటలు, కీర్తనలకు నృత్య రూపం, ఉగాది కథాంశంతో నాటిక, మాయాబజార్ పాటలకు నృత్యాలు, నిన్న- మొన్నటి -నేటి తరాల తెలుగు నటుల పాటలతో నృత్యాలు, శివుడు హనుమంతుడి మధ్య జరిగే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు దాతలు, సంస్థ కార్యవర్గ సభ్యులతో సర్టిఫికెట్లు అందజేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత దౌత్య కార్యాలయ అధికారి ఓ.పీ మీనా మాట్లాడుతూ ఉగాది, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ప్రాముఖ్యత చాటి చెప్పుతూ జూన్ 25న చికాగోలో జరిగే యోగా డేలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. గత సంవత్సరం స్వచ్ఛందంగా సమాజ సేవా, టీఏజీసీ ప్రయోజనార్థం తమ సమయాన్ని వెచ్చించిన యువతకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంతకంతో అందజేసే పీవీఎస్ఏ సర్టిఫికేట్లని ఓ.పీ మీనా, టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా ఏడే, టీఏజీసీ యువజన సంఘ కార్యదర్శి వెంకట్ గూనుగంటిలతో కలిసి అర్హులైన యువతకు బహుకరించారు.
టీఏజీసీ ఏటా నిర్వహించే పలు సేవ కార్యక్రమాలలో భాగంగా ఈ ఈవెంట్ లో రాఫిల్ ద్వారా సేకరించిన నిధులను ‘అక్షయ విద్య’ సంస్థకు అందజేశారు. ప్రముఖ టాలీవుడ్ ప్లేబాక్ సింగర్స్ అంజనా సౌమ్య, దామిని భట్ల , యాజిన్ నిజార్, నరేంద్ర దొడ్డపనేనిలు తమ మధుర గాత్రంతో ప్రేక్షకులను రంజింపజేశారు. హైదరాబాద్ హౌస్ యజమాన్యం, రంగారెడ్డి లెంకల, ఉమా అవధూత, టీఏజీసీ సభ్యులు, అతిథులు, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, మాజీ అధ్యక్షులు కళ్యాణ్ ఆనందుల, ప్రదీప్ కందిమళ్ల, వచ్చే సంవత్సర అధ్యక్షులు జ్యోతి చింతలపనిలు కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసినందుకుగానూ రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలిపారు.