రజనీకాంత్ ‘2.ఓ’ కూడా పైరసీ అయింది… విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమా యూనిట్ మొన్నామధ్య తమ చిత్రం పైరసీకి గురైందని గగ్గోలు పెట్టారు. కోట్లతో నిర్మించిన సినిమా ఇలా పైరసీకి గురైతే తాము ఏం కావాలని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా విడుదలైన రజనీకాంత్ చిత్రం ‘2.ఓ’ కూడా పైరసీ అయింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్లో దొరుకుతుంది. ఇంతకీ ఈ సినిమాలను పైరసీ చేస్తున్న వెబ్సైట్… అది పైరసీ సినిమా చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు…’తమిళ్ రాకర్స్’.
సినిమా విడుదలైన తర్వాత పైరసీ రావడం వేరు. కానీ విడుదల కాకముందే అంటే పోస్టు ప్రొడక్షన్ దశలో ఉండగానే సినిమాలు నెట్లో దర్శనమిస్తున్నాయి. ఆ విధంగా విజయ్ దేవరకొండ చిత్రం ‘టాక్సీవాలా’ పైరసీ అయింది. చిత్రాన్ని విడుదలకు రెండు రోజుల ముందే తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో దర్శనమిచ్చింది. ఇప్పుడు ‘2.ఓ’ కూడా అంతే. ఇవే కాదు కొత్త సినిమా ఏది విడుదలైనా అది ఆ సర్వీస్ ప్రొవైడర్‌లో ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్చేయాలని కోరుతూ ‘2.ఓ’ వేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. పైరసీకి పాల్పడే 37 వెబ్సైట్లను బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో ‘తమిళ్ రాకర్స్’ కూడా ఉంది. ఇంతలా సినిమాలను పైరసీ చేస్తుంటే… తమిళ్ రాకర్స్‌ను బ్లాక్ చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటని కోర్టు పోలీసులను ప్రశ్నించింది.
‘తమిళ్ రాకర్స్’కు చెందిన ప్రోక్సీ సర్వర్‌ను గతంలో బ్లాక్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్‌కు చెందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”తమిళ్ రాకర్స్ అనేది ఏదో ఒక సింగిల్ ప్రొడర్ కాదు. ఇదొక పెద్ద వ్యవస్థలా పెరిగిపోయింది. చాలా చోట్ల నుంచి అప్లోడ్ చేస్తున్నారు. విదేశాల్లో కూడా ఉంది. గతంలో చాలా బ్లాక్‌బస్టర్ చిత్రాలను లీక్ చేశాయి. రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి ప్రాక్సీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నడుస్తున్నట్టు గుర్తించాం. చట్టపరంగా చర్య తీసుకోవాలంటే ఆ దేశాల అనుమతి అవసరం. లీక్ అయిన చాలా ప్రింట్స్ చూస్తే అవి విదేశాలోనూ, మలేషియా, యూరప్ వంటి దేశాల థియేటర్లలో ప్రదర్శితమైనప్పుడు తీసినవిగా స్పష్టమవుతుంది. దీంతో పాటు పోస్టు ప్రొడక్షన్ సమయంలో ఎవరికి వారు సెల్‌ఫోన్లలోనూ, లాప్టాప్లనూ రికార్డు చేసినవి” అని ఆయన వివరించారు.సినిమాకు చెందిన ప్రముఖుల సహకారంతోనే ఈ సైట్లు నడుస్తున్నాయని కూడా చెప్పారు. రజనీకాంత్ చిత్రం ‘2.ఓ’ 12,564 వెబ్సైట్లలో ఉన్నట్టు కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే 1200 పైరసీవెబ్సైట్లను కోర్టు అదేశాల మేరకు బ్లాక్ చేశారు. అందులో రెండు వేల సర్వీస్ ప్రొవైడర్లు వివాదాస్పదంగా ఉన్నవి కూడా ఉన్నాయి.