కొద్దికాలం క్రితం తమిళ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్, విజయ్ తదితరులు కావేరీ జలాల అంశంపై చెన్నైలో నిరాహార దీక్ష చేయడం, దీనిపై కన్నడిగులు అగ్గిమీద గుగ్గిలం కావడం తెలిసిందే. చైన్నైలో దీక్షలు చేస్తేనే కన్నడిగులు భగ్గుమన్నప్పుడు మరి బెంగళూరులో కావేరీ జలాల వివాదం గురిస్తే ప్రస్తావిస్తే… అది సాహసం అనకుండా ఏమనగలం? తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు, నడిగర సంఘం కార్యదర్శి కూడా అయిన విశాల్ బెంగళూరు ఆడియో ఫంక్షన్లో స్వయంగా కావేరీ జలాల సంక్షోభాన్ని ప్రస్తావించడమే కాకుండా పూర్తిగా తమిళంలోనే మాట్లాడారు….
వెండితెరపై ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడని ‘పందెంకోడి’ హీరో విశాల్ తెరవెనుక కూడా అంత ముక్కుసూటిగానే మాట్లాడతారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ప్రతిసారీ ఉప్పూనిప్పూగా ఉండే వివాదాస్పద కావేరి జలాల అంశాన్ని బెంగుళూరులో జరిగిన ఓ కన్నడ చిత్రం ఆడియో ఫంక్షన్లో విశాల్ లేవనెత్తి…నిజంగానే తానో “పందెంకోడి”నని నిరూపించుకున్నారు.
‘తమిళంలో మాట్లాడటానికి నేను గర్విస్తున్నాను. అలా మాట్లాడకుండా నన్నెవరరూ ఆపలేరు కూడా. నీళ్లు అడగడం మా హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. మనమంతా భారతీయులం. కన్నడ గడ్డపై ఉన్న తమిళ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి వారికి ఉంది. అలాగే తమిళనాట ఉన్న కన్నడ ప్రజల పరిరక్షణ బాధ్యత తమిళులదే. కన్నడ నిర్మాతలు సినిమా తీసేందుకు తమిళనాడు వస్తే వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు మేము అందిస్తాం’ అని విశాల్ గంభీర ప్రసంగం చేశారు. అంతేకాదు…ఫంక్షన్ ముగియగానే ఇటీవల పరమపదించిన రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మకు నివాళులు అర్పించడానికి పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్ళాడు