‘సినిమా విజయం సాధించినప్పుడు మనం ఉన్నచోట కచ్చితంగా ఉండం. మనకు తెలియకుండానే సక్సెస్ అల వేగంగా వచ్చి మనల్ని గట్టున పడేస్తుంది. చుట్టూ వాతావరణం చాలా కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది. ఆప్యాయతల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం’ అని తమన్నా అంది . కెరీర్లో విజయాలతో పాటు అపజయాలను కూడా చూసినప్పుడు ఎలా అనిపించింది అని అడిగితే తమన్నా స్పందించింది…
‘‘సినిమా అనేది టీమ్ వర్క్. ఏ ఒక్కరివల్లనో జయమో, అపజయమో కలగదు. నేను నటించిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదంటే అందులో నా భాగం ఎంతో అందరూ ఆలోచించాలి. కొనిసార్లు మనం ప్రయాణం చేస్తున్న నావ మునిగిపోతుందని తెలిసినా కూడా నిబ్బరంగా ముందుకే సాగాలి. అంతేగానీ, సగం దూరంలో ఉన్నప్పుడు దాన్నుంచి దిగడానికి ప్రయత్నించం. సినిమాల్లో నటించడం కూడా అలాంటిదే. ఫలితం కొన్నిసార్లు కళ్ల ముందు కనిపించినా, నవ్వుతూ మన పని చేసుకుని బయటకు వచ్చేయాలి. నా దృష్టిలో కాలం చాలా గొప్పది. ఎలాంటి గాయాన్నైనా మాన్పుతుంది’’ అని చెప్పింది.
ఆమె కళ్లు చాలా అందంగా ఉంటాయి !
దక్షిణాదిలో కథానాయికగా మంచి పేరు సంపాదించుకున్నారు తమన్నా. సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల హిందీలో ఓ సినిమాకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించనున్నారు. కాగా బాలీవుడ్లో ఏ హీరోయిన్ వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టం? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే…‘‘దీపికా పదుకోన్ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఆమె కళ్లు చాలా అందంగా ఉంటాయి.ప్రయోగాత్మక చిత్రాలను చేయడానికి ఇష్టపడుతుంటారామె’’ అన్నారు.
మరి హాలీవుడ్లో? అంటే ‘‘ప్రముఖ నటి మెరిల్ స్ట్రిప్స్ అంటే విపరీతమైన అభిమానం. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తారామె. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ‘పెట్రోమాక్స్’ సినిమాతో బిజీగా ఉన్న తమన్నా తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి, సైరా: నరసింహారెడ్డి’ సినిమాలను పూర్తి చేశారు