తమన్నా వచ్చే ఏడాది ఏకంగా ఆరు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పక్కా ప్లానింగ్‌తో ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ వచ్చే ఏడాది డేట్స్ డైరీని నింపేసింది. ‘బాహుబలి 2’లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో, ‘జై లవ కుశ’లో కేవలం ఓ ప్రత్యేక పాటలో మెరిసిన తమన్నాకు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విజయాలు, అవకాశాలు దక్కలేదు.
ఏకంగా ఆరు ప్రాజెక్టులు తమన్నా సిద్ధం చేసుకోవడం విశేషం… పక్కా ప్లానింగ్‌తో ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ వచ్చే ఏడాది డేట్స్ డైరీని నింపేసింది. తాజాగా మరో రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు అంగీకరించి వచ్చే ఏడాదిని క్షణం తీరికలేకుండా సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ప్రస్తుతం విక్రమ్ సరసన నటించిన ‘స్కెచ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ సినిమా, కళ్యాణ్‌రామ్ సరసన నటిస్తున్న చిత్రం, సందీప్ కిషన్‌కి జోడీగా చేస్తున్న సినిమా ఉన్నాయి.
తమిళంలో మహిళా ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రం, బాలీవుడ్లో ‘ఖామోషి’ చిత్రం, కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ నటిస్తోంది. తాజాగా తమిళ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపింది. విజయ సేతుపతి, తమన్నా నటించిన ‘ధర్మదురై’ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీను రామస్వామి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై రూపొందబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది.
పరిస్థితులు మారాయనే తగ్గించుకుంది !
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా .. టాలీవుడ్లో, కోలీవుడ్‌లో ఇంచుమించు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. దీనికి తగ్గట్టే పాపులారిటీ ఉండటంతో పారితోషికాన్ని కూడా భారీగా పెంచుకుంటూ పోయిందని కోలీవుడ్ టాక్. మధ్యలో అవకాశాలు కొరవడ్డా ‘బాహుబలి’తో మరోసారి విజృంభించింది తమన్నా.. ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని రూ.కోటి వరకూ పెంచేసిందట. దీంతో అవకాశాలు తగ్గాయని సినీ జనాలు అంటున్నారు.
తమన్నాకు అవకాశాలు తగ్గడానికి కారణం ఇదీ ఒక కారణం కాగా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం మరో కారణం.. ఏదేమైనా పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించిన ఈ బ్యూటీ ఒక మెట్టు దిగొచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుందని, దీంతో మళ్లీ ఆమెకు అవకాశాలు తలుపుతడుతున్నాయని సమాచారం. ఇంతకుముందు చిత్రానికి కోటి రూపాయల వరకూ, సింగిల్ స్పెషల్ సాంగ్‌కు రూ. 60 లక్షల వరకు పుచ్చుకున్న తమన్నా.. ఇప్పుడు పారితోషికం విషయంలో పట్టువిడుపులు పాటిస్తున్నట్లు సినీవర్గాల్లో వినిపిస్తోంది.