“నెంబర్ వన్ హీరోయిన్ కాకపోయినా ఫరవాలేదు. టాప్ హీరోయిన్ కాకున్నా ఓకే. నేను సంతోషంగా ఉంటే చాలు. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి. నేను చేసే చిత్రాలతో.. వచ్చే అవకాశాలతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా”… అని అంటోంది ‘పింక్’, ‘ఘాజీ’,‘బద్లా’,‘సాండ్ కీ ఆంఖ్’వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసిన తాప్సి. “అదృష్టం కొద్దీ నా చిత్రాల్లో చాలావరకూ విజయాలు సాధించాయి. కొన్ని సాధించలేదు. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నా. సినిమాల్లోనూ… జీవితంలోనూ నేనిప్పుడు మంచి స్థాయిలో, సంతోషంగా ఉన్నాను.
‘ఎంతమంది పెద్ద హీరోలతో నటించింది? చిన్న పాత్ర అయినప్పటికీ.. ఎన్ని భారీ చిత్రాల్లో నటించింది?’ అనే అంశాలపై మామూలుగా కథానాయికల మనుగడ ఆధారపడి ఉంటుంది. దాన్నిబట్టే హీరోయిన్లకు సినిమాలు వస్తాయి. అయితే… రెండేళ్ళలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేను ఎటువంటి చిత్రాల్లో నటించాలనుకున్న అవకాశాలు నాకు గతంలో రాలేదు. అప్పుడు పెద్ద చిత్రాల్లో నటించడం మానేశాను. అంతకు ముందు ఏడాదికి నా చిత్రాలు ఆరేడు విడుదలైతే… ఆ తర్వాత ఒక్క చిత్రమే విడుదలైంది. నాతో పాటు అందరికీ అదొక పెద్ద షాక్. తాప్సీ పని అయిపోయిందని అనుకున్నారు. నేనప్పుడు… నన్ను సంతోషంగా ఉంచే చిత్రాల్లో… నేను గర్వపడే చిత్రాల్లో మాత్రమే నటించాలనుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చిన కథల్లో నటించే స్థాయిలో ఉన్నాను.
వర్కవుట్ కావని తెలుసుకున్నా
నా కెరీర్ బిగినింగ్‌లో ఎటువంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో, తెలియదు. ‘నువ్వు ఈ సినిమా చేయాలి. ఈ పాత్ర చేయాలి. ప్రతి హీరోయిన్ చేస్తుంది. చేస్తే పెద్ద హీరోయిన్‌వి అవుతావు’ అని చెప్పిన మాటలు విన్నాను. అందుకని, కొన్ని చిత్రాలకు ‘యస్’ చెప్పాను. ఇతర హీరోయిన్లకు ఓకే కానీ, నాకు అటువంటి చిత్రాలు వర్కవుట్ కావని నెమ్మదిగా తెలుసుకున్నాను. నా సొంత బుర్ర ఉపయోగించాలనీ, సినిమాలు ఎంపిక చేసుకోవడం తెలుసుకోవాలనీ అనుకున్నా. నాకు నేనుగా సినిమాలు ఎంపిక చేసుకున్నాను.
తెలివితక్కువతనమే అవుతుంది
గ్లామర్ రోల్స్ చేయకూడదని నియమం ఏదీ పెట్టుకోలేదు. ‘జుడ్వా 2’ చేశాను కదా.మంచి దుస్తులు వేసుకుని ఫ్యాన్సీగా కనిపించాలని నాకూ ఉంటుంది. అలాగని, కథలో ప్రాముఖ్యం లేని పాత్రలు చేయను. సినిమా అంతా నాలుగు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి, పాటలు చేయమంటే చేయను. సినిమా లోంచి నా పాత్రను తీసేసినా… ఎటువంటి నష్టం ఉండదంటే…అటువంటి పాత్రలు, చిత్రాలు చేయడం తెలివితక్కువతనమే అవుతుంది. అటువంటి చిత్రాలు గతంలో చేశాను. అవి చాలు. మళ్లీ చేయాలనుకోవడం లేదు.
వైవిధ్యమైన కథల్లో నటించడం సౌకర్యంగానే ఉంటుంది. ప్రతిరోజూ ఏదో ఒకటి కొత్తగా చేసే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే… అందులో నేను ఎలా నటిస్తానో? ఎలా చేస్తానో? నాకూ తెలియదు. ఈ రోజు నేను ఏం చేయబోతున్నాననేది నాకూ ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. నేను ఎలా చేయాలో? చేస్తానో? నాకు తెలియకపోతే అదొక పెద్ద సవాల్ !