‘ఖైదీ నంబర్ 150’ మూవీతో చాలా గ్యాప్ తర్వాత ఈ యేడాది జనానికి మరోసారి చేరువయ్యారు చిరంజీవి.ఆయన 1983నుంచి ప్రేక్షక లోకం అభిమానం చూరగొంటున్నారు. చిరంజీవిగా ఇండస్ట్రీకి పరిచయమైన శివశంకర వరప్రసాద్ నేటికీ తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవలే చిరు తన 151వ సినిమా పూజకార్యక్రమాలు నిర్వహించారు. దేశభక్తుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇవాళ ఆయన 63వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిరు బర్త్‌డే సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి 151వ సినిమా టైటిల్ లోగోను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరు 151వ సినిమాకు సంబంధించిన ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి… ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనుకున్నారు. తాజాగా ‘సైరా’ అనే టైటిల్.. తెరపైకి వచ్చింది. చివరకు సస్పెన్స్‌కు తెరదించుతూ చిరంజీవి పుట్టినరోజున రాజమౌళి టైటిల్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిరు మూవీ టైటిల్ ‘సైరా నరసింహారెడ్డి’.
రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే ‘సై రా నరసింహారెడ్డి’ అనే పదాలనే చిరు 151వ సినిమా టైటిల్ గా నిర్ణయించారు చిత్ర నిర్మాతలు. ‘సైరా’ అని టైటిల్ గా ఫిక్స్ చేసి ‘నరసింహరెడ్డి’ని క్యాప్షన్ గా పెట్టారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ చిరు 151వ చిత్రాన్ని నిర్మించనున్నాడు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేఖంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనుండగా, పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.