తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ జీవిత నవలిక “ఊగిసలాడకె మనసా” మరియు పూణే వాస్తవ్యులు రవీణ చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజాయ సారథి” పుస్తకాల ఆవిష్కరణ తెలంగాణా భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సభాధ్యక్షులుగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు నాళేశ్వరం శంకరం గారు వ్యవహరించగా, తెలుగురథం సాహితీ సంస్థ వ్యవస్థాపకులు కొంపెల్ల శర్మ గారు స్వాగత పలుకులు, వందన సమర్పణలతో సభను నిర్వహించారు.
ప్రగతి స్కూల్ చిన్నారులు అక్షర, సింధూర, వైష్ణవి మరియు మాయ గణపతి వందన సమర్పణ మరియు కూచిపూడి నృత్యంతో సభ కన్నులపండువుగా మొదలయ్యింది.
అనంతరం బాటసారి మరియు రవీణలు రచించిన వారి పుస్తకావిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ చేతుల మీదుగా జరిగింది. బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ తొలి ప్రతిని శ్రీమతి రవీణ చవాన్ స్వీకరించగా, రవీనా చవాన్ రచించిన ‘స్వజాయ సారథి’ వారి NRI తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మి తులసి మరియు శ్రీ సత్యనారాయణ స్వీకరించారు.
అనంతరం మామిడి హరికృష్ణ మాట్లాడుతూ- సమాజానికి సందేశాన్నిచ్చే రచనలు రావాలని అన్నారు. దైనందిన జీవితంలో అందరికి ఎదురయ్యే అనుభవాలను సులువుగా అర్ధమయ్యేలా బాటసారి రచన ఉందన్నారు. చైతన్య పరిచే సూక్తులతో స్ఫూర్తిని రగిలించే కవితా సంపుటి ‘స్వజాయ సారథి’ విశేషం అన్నారు.
అనంతరం విశిష్ట అతిథులైనఅనంతపూర్ నుండి విచ్చేసిన ప్రముఖ కవి రాధేయ ఉమ్మిడిశెట్టి మాట్లాడుతూ- నెల్లూరు నుండి వచ్చిన అంతర్జాతీయ కవి శ్రీ పెరుగు రామకృష్ణ ఇరువురు రచయితలను, వారి రచనలను పొగిడారు.
ప్రముఖ రచయిత్రి శ్రీమతి స్వాతీ శ్రీపాద మాట్లాడుతూ ఇలాంటి సభల్లో యాభై శాతం మహిళలు కూడా ఉంటే బావుంటుందన్నారు. స్వజయ సారథి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ సంపుటిలో ఒక కవితను తీసుకొని కవిత ఎలా చదవాలి అని ప్రేక్షకులకి తెలియజేసి ఆకట్టుకున్నారు.
వంద సినిమాలకు పైగా మాటలు అందించిన ప్రముఖ తెలుగు సినీ రచయితా దివాకరబాబు మాడభూషి మాట్లాడుతూ భమిడిపాటి వారు సినీరంగప్రవేశానికి గేట్లు తెరిచారని, ఇప్పుడు ఈ భమిడిపాటి వాడైనా బాటసారిని తానూ ప్రోత్సహిస్తున్నానని చెప్పారు.
ప్రముఖ కవయిత్రి శ్రీమతి మిరేజ్ ఫాతిమా మాట్లాడుతూ బాటసారి రచన ఆడవారి మనసుని అర్ధం చేసుకొని రాసే రచనలని, ఈరోజుల్లో అలా ఎవరూ రాయడం లేదని, ప్రముఖ రచయిత, బాటసారి తన గురువుగా భావంచే చలం గారి ఫోటో ఎక్కడ చూసినా బాటసారి గుర్తొస్తాడని, మరో మైదానంలా తన రచన ఉంటుందని బాటసారి రచనలని కొనియాడారు.
ప్రముఖ రచయిత, కవి RVSS గారు ఊగిసలాడకె మనసా నవలికను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని తీసుకుని నవలీకరించడంలో బాటసారి కృతకృత్యులైనారని, చేయి తిరిగిన రచయితలా కథనాన్ని నడిపించారని నవలలో ప్రతి పంక్తి చెపుతుందని అన్నారు. సన్నివేశాలన్నింటిని సహజంగా ఉండేలా రాయాలంటే ఎంతో కష్టమైన పని. స్త్రీ పాత్రలో పరకాయప్రవేశం చేసి మనోభావాలను చెప్పిన తీరు నిజంగా అద్భుతమనిపించింది అని కొనియాడారు. మౌనశ్రీ విశిష్ట అతిథిగా విచ్చేసిన సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తన స్పందనను పాట ద్వారా పాడి వినిపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను స్వీకరించారు.
కొంపెల్ల శర్మ మాట్లాడుతూ మనసు కి విలువలుండాలని, విలువల వలువలు లేని జీవితం వ్యర్థమని అన్నారు. వారు ప్రత్యేకంగా ఇద్దరు రచయితలని సన్మానించారు.
పిసిపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ నాళేశ్వరం శంకరం గారు సూరత్ సాహిత్యోత్సవంలో చెప్పినట్టుగా గ్రంథాలయానికి పుస్తకాలను రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు ఇవ్వవలసినదిగా కోరగా, ఆ గ్రంథాలయానికి ఉట్టికోట ఆళ్వారుస్వామి పేరుతో రాష్ట్రాల్లో గ్రంథాలయాన్ని మొదలు పెట్టవలసినదిగా కోరారు. వివిధ రాష్ట్రాల్లో కవులు రచయితలూ, కళాకారులు మరియు ఏ భాషలోకైనా తర్జుమా చెయ్యగల రచయితలను కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కో ఆర్డినేటర్ అయినా రవీనా చవాన్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని పిసిపట్టి ప్రసాద్ గారు కోరారు.
అనంతరం ఈ పుస్తకావిష్కరణకు గుజరాత్ నుండి వచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చైర్మన్ పిసిపాటి ప్రసాద్ గారిని, ముంబై నుండి వచ్చిన అశోక్ కంటే గారిని మామిడి హరికృష్ణ సన్మానించారు. రచయితలు మామిడి హరికృష్ణ గారిని నాళేశ్వరం శంకరం గారిని సన్మానించగా విశిష్ట అతిథులని ఆత్మీయ అతిథులైన డా. అశోక్ బాబు, మురళీధర్ అడ్ల మరియు విజయ్ కుమార్లను, సీనియర్ జర్నలిస్ట్ జివి ఎల్ ఎన్ మూర్తి, వాట్సాప్ గ్రూప్ కవిసమ్మేళనం వ్యవస్థాపకులు మేకా రవీంద్ర గారిని మామిడి హరికృష్ణ సన్మానించారు. డా. అశోక్ బాబు, మేక రవీంద్ర, శ్రీమతి ఇందిరా, శ్రీ RVSS శ్రీనివాస్, మధుసూదన్ మరియు తాళపత్ర గ్రంథ పరిశోధకుడు కావూరి శ్రీనివాస్ ఆశీస్సులతో రచయితలిద్దరిని సన్మానించారు. రచయితలకు అభిమానులైన ముఖపుస్తక స్నేహితులు, ఆత్మీయులు తమ ఇష్టమైన రచయితలను సన్మానించుకొని అభినందనలు తెలియజేసారు. పసందైన విందు భోజనం రచయితలు ఏర్పాటు చేయగా పుస్తకావిష్కరణ సభ ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుని ఆత్మీయుల నడుమ సంతోషంగా ఘనంగా ముగిసింది.