సినీ వినోదం రేటింగ్ : 4/5
2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి.జె.జ్ణానవేల్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక ‘జైభీమ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఐదు భాషల్లో నవంబర్ 02, 2021 న అమెజాన్ ప్రెమ్ వీడియో లో విడుదలయ్యింది.
కధ… రాజన్న ( మణికందన్ ) సినతల్లి ( జిమోమోల్ జోస్ ) ఆదివాసీలు. ఊరి చివర పూరి గుడిసెలో కాపురం. ఎలుకల్ని , పాముల్ని పట్టడం… కూలీపని, ఇటుకల బట్టీలో పని చేసి జీవనం గడుపుకోవడం… ఇదే వారి జీవితం. రాజాపురం ప్రెసిడెంట్ ఇంట్లో ఒక రోజు పాము దూరుతుంది. ఆ పాముని పట్టుకోవడం కోసం రాజన్నకి కబురు వస్తుంది. రాజన్న వెళ్లి పాము పట్టి వేరే చోట వదిలేస్తాడు. ఆ తర్వాత రోజే ప్రెసిడెంట్ గారి ఇంట్లో వున్న బంగారు ఆభరణాల దొంగతనం జరుగుతుంది. ప్రెసిడెంట్ వెళ్లి పోలీసు కేసు పెడతాడు. విచారణ చేపట్టిన పోలీసులు రాజన్నతో పాటు కుటుంబం మొత్తాన్ని స్టేషన్ తీసుకువెళ్లి చిత్రవధ చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా హింసిస్తారు. ఈ క్రమంలో ఒక రోజు రాజన్నతో పాటు మరో ఇద్దరు పోలీసు స్టేషన్ నుంచి కనిపించకుండా పోతారు. అన్యాయానికి గురౌతున్న ఆదివాసీలు, గిరిజనుల తరుపున ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, మానవ హక్కుల పరిరక్షణకై పోరాటం చేసే లాయర్ చంద్రు (సూర్య) దగ్గరికి న్యాయం కోసం వెళుతుంది రాజన్న భార్య సినతల్లి. తన కళ్ళ ముందే తన భర్తని పోలీసు స్టేషన్ లోకి తీసుకెళ్ళిన పోలీసులు.. తప్పించుకుపారిపోయాడని చెబుతున్నారని, అసలు తన భర్త ఎక్కడ వున్నాడో, అన్యాయంగా కేసులో ఇరికించిన పోలీసులు తన భర్తని ఏం చేసారోనని, తమకు న్యాయం చెయ్యాలని లాయర్ చంద్రుని ప్రాధేయపడుతుంది సినతల్లి. ఈ కేసు విషయంలో చంద్రుకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు రాజన్నని పోలీసులు ఏం చేశారు ? చివరికి రాజన్నకి న్యాయం జరిగిందా ? అనేది సినిమాలో చూడాలి…
విశ్లేషణ… తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేసాడు దర్శకుడు జ్ణానవేల్. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల్లానే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామా. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం… దర్శకుడు జ్ఞాన్వేల్ అలాంటి విషయాన్నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సక్సెస్ అయ్యాడు.
సినిమా మొదలైన ముఫ్ఫై నిమిషాల వరకూ సూర్య తెరపై ఒక్కసారి కూడా కనిపించడు. లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి నుండి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడనే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో ఉత్కంఠ పెరుగు తుంది. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. కొందరు పోలీసులు అమాయకులపై అక్రమ కేసులు పెట్టి, వారిచేత నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను దర్శకుడు సహజంగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఈ సినిమా పోలీసుల క్రూరత్వాన్ని చూపించింది. అదే సమయంలో పోలీసుల్లో నిజాయితీ కూడా చూపించింది. ఈ సినిమా అన్యాయాన్ని చూపించింది. అదే సమయంలో న్యాయం జరిగే అవకాశాన్నీ చూపించింది.
నటీనటులు… సూర్య లాంటి నటుడు కమర్షియల్ అంశాల్ని, మాస్ ఎలిమెంట్స్‌నీ పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. అతడే ఆ సినిమాకి నిర్మాత కూడా. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. సూర్య ఎప్పటి లానే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ఇక గిరిజన దంపతులు రాజన్న గా మణికందన్, సినతల్లిగా లిజో మోల్ జోసేలు ఈ కథకు ఆయువు పట్టు. పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని అన్యాయాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె గొప్పగా నటించింది. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో న్యాయం చేసారు.
సీన్ రొనాల్డ్ నేపధ్య సంగీతం బాగుంది.. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు. ఎస్.ఆర్.కదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఫిలోమిన రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. కధాకాలం నాటి వాతావరణ పరిస్థితులను ప్రతిబింబించేందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం కనిపించింది. కొన్ని డైలాగ్స్ అద్భుతంగా పేలాయి -రాజేష్