సినీ వినోదం రేటింగ్ : 3/5
2డీ ఎంటర్టైన్మెంట్, శిఖ్యా ఎంటర్టైన్మెంట్ సుధాకొంగర దర్శకత్వంలో సూర్య, గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
కధ… చంద్రమహేశ్(సూర్య) తండ్రి స్కూల్ మాస్టార్. అతని పద్ధతులు ఆవేశపరుడైన చంద్రమహేశ్‌కి నప్పవు. దాంతో ఓ రోజు తండ్రితో గొడవపడి ఇంటి నుండి బయటికెళ్లిపోతాడు. తర్వాత ఫైటర్ ఫైలట్‌గా ఎన్డీఏలో ఉద్యోగం చేస్తుంటాడు. కొడుకు మీద దిగులుతో మహేశ్ తండ్రి మంచాన పడతాడు. తండ్రిని చూడటానికి వెంటనే వెళ్లడానికి విమానం కరెక్ట్ అని భావించిన చంద్రమహేశ్ ఎయిర్‌పోర్టు వెళితే.. ఎకానమీ టికెట్స్ అయిపోయానని.. బిజినెస్ క్లాస్ టికెట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి విమానం ఎక్కనివ్వరు. చివరికి బస్సు, ట్రైన్లో మహేశ్ ఇల్లు చేరుకుంటాడు. కానీ అప్పటికే తండ్రి దహన సంస్కారాలు పూర్తైపోతాయి. ఆ బాధతో మహేశ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఎలాగైనా విమానంలో పేదవాడు ప్రయాణించేలా చేయాలని భావిస్తాడు. రీసెర్చ్ చేసి అందుకు తగిన బిజినెస్ ప్లానింగ్ కూడా చేసుకుంటాడు. కానీ మహేశ్‌కు ఏ ఇన్వెస్టర్ కూడా సపోర్ట్ చేయడు. ఇతర విమానయాన సంస్థల అధినేతలు మహేశ్ ప్రయత్నాన్ని అడ్డుకుంటారు. తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అవుతాడు? చంద్రమహేశ్‌కి, అతని భార్య ఎలా సపోర్ట్ చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాలో చూడాలి..
విశ్లేషణ… ‘ఎయిర్ డెక్కన్’ ఫౌండర్,ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓ సాధారణ స్కూల్ టీచర్ కొడుకు అహోరాత్రులు కష్టపడి ఓ ఎయిర్ లైన్స్ సంస్థను ఎలా స్థాపించాడు అన్నదే సినిమా కథ. ఇరవై వేల రూపాయల విమాన టికెట్‌ను మధ్య తరగతివాడి అందుబాటు ధరలోకి తీసుకు రావడమనేది చాలా గొప్ప విషయం. ఓ సామాన్యుడు తన ఆలోచన, సమస్యలను అధిగమించి విమాన సంస్థకు అధినేత కావడం కలలో కూడా ఊహించలేం. కానీ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గోపీనాథ్ జీవితాన్ని తెరకెక్కించడం స్పూర్తినిచ్చే విషయం. దానికి తగినంత ఎమోషన్స్, నాటకీయతను జోడించి డైరెక్టర్ సుధా కొంగర సినిమాను తెరకెక్కించారు.సుధాకొంగర .. సినిమాను ఎక్కడా అతి లేకుండా బేలన్స్ చక్కగా మైంటైన్ చేశారు. రియలిస్టిక్ స్టోరీ కాబట్టి పర్ఫెక్షన్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు. నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్స్ తో కథ నేపథ్యానికి తగట్లు కొన్ని సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు. అందుకు తగినట్లే పాత్రలను మలిచారు. సూర్య పాత్రను.. అపర్ణా బాలమురళి.. తదితర పాత్రలను సుధా కొంగర చక్కగా డిజైన్ చేశారు.
నటన… హీరో సూర్య గోపీనాథ్ పాత్రలో ఒదిగిపోయారు.పరకాయ ప్రవేశం చేశాడు అనటం బాగుంటుంది. చాలా రోజుల తర్వాత సూర్య పెర్ఫామెన్స్‌కు తగ్గ పాత్ర దొరికింది. ఎమోషన్స్ నిండిన చంద్రమహేశ్ పాత్రలో సూర్య కొన్ని సన్నివేశాల్లో తన నటనతో కంటతడి పెట్టిస్తాడు కూడా. హీరోయిన్ అపర్ణా బాల మురళీ నటన కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. భర్త ఆశయాన్ని గుర్తించి అతనికి సపోర్ట్ చేసే భార్యగా అపర్ణ నటన ప్రశంస నీయం .ఇక ఇద్దరి మధ్యా చోటుచేసుకునే సన్నివేశాలు బాగా రక్తికట్టాయి. చేసింది చిన్న పాత్రే అయిన మోహన్‌బాబు తనదైన నటనతో పాత్రను ఎలివేట్ చేశారు. పరేశ్ రావల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్య పాత్రను అడ్డుకునే మరో విమానయాన సంస్థ అధినేతగా విలనిజాన్నిచక్కగా ప్రదర్శించారు.
సాంకేతికం… జీవీ ప్రకాశ్‌కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ఎస్సెట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చాలా బాగుంది. నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది .మంచి విజువల్స్‌తో ఆకట్టుకుంది.సతీశ్ సూర్య ఎడిటింగ్ బాగుంది -రాజేష్