‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వయసు పెరిగే కొద్ది సినిమాల స్పీడూ పెంచుతున్నారు. ఇటీవల ‘పేటా’తో మెప్పించిన ఆయన ఇప్పుడు ‘దర్భార్’ సినిమాలో నటిస్తున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ముంబాయిలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రజనీ తన అల్లుడు ధనుష్ కోసం ఓ సినిమా చేయనున్నారట.
హీరో ధనుష్ తన వండర్‌బార్ పతాకంపై రజనీకాంత్ హీరోగా ‘కాలా’ చిత్రాన్ని నిర్మించారు. ఇది బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతగా ధనుష్‌కి భారీ నష్టాలని తెచ్చిపెట్టిందట. ఆ లోటుని భర్తీ చేసేందుకు రజనీకాంత్ వండర్‌బార్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ధనుష్‌ని నిర్మాతగా ఆదుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయబోతున్నారట. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది.
మరోవైపు మరో అల్లుడు, సౌందర్య భర్త విశాగన్ వనంగముడిని హీరోగా నిలబెట్టాలనుకుంటున్నారట. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలోనే అల్లుడు హీరోగా ఓ సినిమా చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ఎవరితో ఎప్పుడుంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న ‘దర్బార్’ ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. నయనతార కథానాయిక. నివేదా థామస్ రజనీకి కూతురు పాత్రలో నటిస్తుంది. ఇందులో హిందీ నటుడు ప్రతీక్ బబ్బర్ మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, తాజాగా మలయాళ నటుడు చెంబన్ వినోద్ మరో విలన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, హెచ్ వినోద్ డైరెక్షన్లో ఓ సినిమాని రజనీ చేస్తారు.