సూపర్‌స్టార్ మహేశ్, కియరా అద్వాని జంటగా నటించిన చిత్రం `భరత్ అనే నేను`. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య.డి.వి.వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ ఇంటర్వ్యూ….
రాజకీయాలంటే ఆసక్తి లేని మీరు ఈ సినిమాలో ?
– డైరెక్టర్ కొరటాల శివగారిని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆయన నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అదే సమయంలో భయంగా కూడా అనిపించింది. సినిమాలో నేను సీఎం క్యారెక్టర్లో కనపడతానని అన్నారు. నాకు.. రాజకీయాలకు సంబంధం లేదు. అదే సమయంలో అలాంటి పాత్ర చేయడం ఓ బాధ్యతతో కూడుకుంది..గౌరవంగా అనిపించింది. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. అలాగని నేను రాజకీయాల్లోకి వస్తానని కాదు. ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఒక పొలిటికల్ మూవీ చేసి దానితో ఏడాదిన్నర పాటు ట్రావెల్ అయినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. దాని కారణంగా ఇలాంటి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చక్కగా డిజైన్ చేశారు
– సినిమా కోసమంటూ ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు. శివగారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఓ పొలిటికల్ సినిమాకు డైలాగ్స్, స్క్రిప్ట్ రాయడం అంత సులభమైన విషయం కాదు. లాజిక్స్ అన్ని పర్ఫెక్ట్గా, టైట్‌గా ఉండాలి. అదే సమయంలో నా క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చక్కగా డిజైన్ చేశారు. అలాగే పొలిటికల్ సినిమా కాబట్టి ఇందులో డైలాగ్స్ కూడా కష్టమనిపించింది. ఇంత పెద్ద డైలాగ్స్ నా కెరీర్లో ఎప్పుడూ చెప్పలేదు. అయితే శివగారి హెల్ప్‌తో కాన్ఫిడెంట్‌గా పూర్తి చేసేశాను. ఇక పాత్ర పరంగా నేను చేసిన హోం వర్క్ అంటే నా బావ పార్లమెంట్లో మాట్లాడిన రెండు, మూడు వీడియోస్ చూశాను. పాత్ర కోసం ఎవరినీ ఇమిటేట్ చేయలేదు. ఫ్రెష్ అప్రోచ్‌తో సినిమా చేశాం.
ప్రస్తుత రాజకీయాలపై సెటైర్స్ ఉంటాయా?
– అలాంటివేమీ ఉండవు. మేం చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేశాం. అందరూ పొలిటీషియన్స్ సినిమాను చూడొచ్చు. కచ్చితంగా మమ్మల్ని అప్రిసియేట్ చేస్తారు. హానెస్ట్ పొలిటికల్ డ్రామాయే ఈ సినిమా.
ఈ సినిమా తర్వాత రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడిందా?
– అలాంటి దేమీ లేదు. నాకు.. రాజకీయాలకు సంబంధం లేదు. నా ఎంటైర్ లైఫ్ సినిమాలకే.
ప్రతి పౌరుడికి ఓ బాధ్యత ఉండాలి !
– తప్పకుండా ఉంటుంది. ప్రతి పౌరుడికి ఓ బాధ్యత ఉండాలి. అలాగే పలు సమస్యలను సినిమాలో చూపించాం. రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. శివగారి సినిమాల్లో మెసేజ్‌లుంటాయి. ఇక పొలిటికల్ మూవీ అంటే చెప్పాలా.. చాలా మెసేజ్‌లుంటాయి. ఈ మెసేజ్‌లు పర్టికులర్‌గా వీళ్లకి అని ఉండదు. ఎవరిపైన సెటైర్స్ ఉండవు. నిజాయతీతో కూడిన ప్రయత్నం. మంచి జెన్యూన్ పొలిటికల్ ఫిలిం వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుంది.
ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ?
– ఉన్నాయండీ.. శివగారు కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్‌ను అసలు విడిచిపెట్టరు. పొలిటికల్ మూవీలో సీఎం ఎలా ఫైట్ చేస్తాడు? ఎలా డాన్స్ చేస్తాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
అందరూ బాగా కనెక్ట్ అవుతారు !
– సాధారణంగా ప్రజలకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉంటుంది. రాజకీయాల్లో ప్రజల బాధ్యత ఏంటనే పాయింట్‌కు అందరూ బాగా కనెక్ట్ అవుతారు.
అంత సులభమైన విషయం కాదు !
– ముఖ్యమంత్రి పదవి అనేది ఓ బాధ్యత అని అర్థమైంది. సీఎం పదవిని నిర్వర్తించడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి ఓ గొప్ప పాత్రను నేను చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
ఈ సినిమాతో హిట్ కొట్టాలనే ఒత్తిడి ఏమైనా ఉందా?
– ప్రతి సినిమాకు ఒత్తిడి ఉంటుంది. ఏ సినిమా చేసినా సూపర్‌హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తాం. అయితే నా కెరీర్లోనే ప్రీ రిలీజ్ ఫేజ్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. టీం అంతా చాలా హ్యాపీగా , కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. శివగారు ఐదు గంటల పాటు సబ్జెక్ట్ చెప్పారు. ఫస్టాఫ్ ఒకరోజు, సెకండాఫ్ ఒకరోజు చెప్పారు. ప్రతి సీన్ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. చాలా సీన్స్ ఇప్పుడు లేవు. బాధగా ఉంది. రెండు పార్టులుగా తీసుంటే బావుండేదనిపించింది. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే సీఎం పాత్రలో కనపడతాను.
మీ అమ్మగారి పుట్టినరోజున సినిమా విడుదల ….
– చాలా సంతోషంగా ఉంది. నిజానికి సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేద్దామని అనుకున్నాం. తర్వాత మేము, నా పేరు సూర్య సినిమా నిర్మాతలు మాట్లాడుకుని మేం ఏప్రిల్ 20.. వాళ్లు మే 4న రావాలని అనుకున్నాం. సినిమా ప్రీ పోన్ అయ్యింది. అప్పటికీ కూడా నాకు ఐడియా రాలేదు. అయితే మా అక్క మంజుల ఏప్రిల్ 20న మా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పారు. వినగానే ఆనందమేసింది. అంతకంటే మంచి రోజు లేదనిపించింది. సినిమా ప్రీ పోన్ కావడం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను.
హీరోయిన్ కియరా అద్వాని చక్కగా చేసింది
– ఇలాంటి పొలిటికల్ సినిమాలు చేసేటప్పుడు స్టార్ హీరోయిన్స్ కాకుండా కొత్త అమ్మాయిలుంటే బావుంటుందని కొరటాల శివగారికైనా, నాకైనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే సీఎం గర్ల్ ఫ్రెండ్‌గా పెద్ద హీరోయిన్స్ ఉంటే ఎంత వరకు కనెక్ట్ అవుతారో నాకు తెలియదు. కొత్త అమ్మాయి ఉంటే ఏ సమస్యా ఉండదు. ‘ధోని’ సినిమాలో కియరా అద్వానిని చూసిన శివగారు తనను సంప్రదించారు. ఆమెకు నటించడానికి అంగీకరించింది. తను పాత్రను చక్కగా చేసింది
ఎన్టీఆర్‌ను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి గెస్ట్‌గా పిలవడం ఎందుకు?
– నాది, కొరటాల శివ సహా టీం అందరం తీసుకున్న నిర్ణయమది. ఇకపై ట్రెండ్ మారుతుంది. ఓ స్టార్ హీరో ఫంక్షన్‌కి మరో స్టార్ హీరో వెళతాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి థాంక్స్.
మీరు చరణ్, ఎన్టీఆర్ కలుసుకున్నప్పుడు …
– సినిమాలు తప్ప.. ముగ్గురు స్నేహితులు కలిస్తే ఏ విషయాలు మాట్లాడుకుంటారో అలాంటి విషయాలే మాట్లాడుకుంటాం.
నాన్నతో కనెక్టింగ్‌గా ఏమైనా అనిపించిందా?
– ఈ సినిమా విషయంలో నాన్నతో కనెక్టింగ్ విషయాలు చాలానే అనిపించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ రిలీజ్ అయినప్పుడు నా గొంతు విని అచ్చం.. నాన్నగారి గొంతులానే ఉందన్నారు. డబ్బింగ్ చెప్పగానే ఆ ఫీలింగ్ నాకే కలిగింది. ఆ విషయాన్ని శివగారికి కూడా చెప్పాను. ఎక్కడో సబ్ కాన్షియస్గా ఉన్న ఫీలింగే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యిందనుకుంటాను. అంతే తప్ప.. ఆయన్ను ఇమిటేట్ చేయాలనేం కాదు.
ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేస్తారా?
– ఇకపై ప్రయోగాలు చేసే ఓపిక లేదు. అలసిపోయాను. నాన్నగారి అభిమానులు ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నారు. ఇకపై అందరికీ నచ్చే కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు?
– జూన్‌లో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాను. సుకుమార్‌గారు, సందీప్ వంగా, త్రివిక్రమ్‌గారి సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే ఏ సినిమా ముందు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేను. అంతా ఓకే అయ్యాక వివరాలు వెల్లడిస్తాం.