సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాణీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన `భరత్ అనే నేను` ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్లబ్ చేరిన చిత్రంగా ఘనత అందుకుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ జెర్.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా సక్సెస్ మీట్ జరిగింది….
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, ` గత రెండు సంవత్సరాల నుంచి చాలా వెలితిగా ఉండేది. భరత్ అనే నేను సక్సెస్ ఆ వెలితిని తొలగించింది. బ్రహ్మాజీ, నేను కలిసి నటించిన సినిమాలు దాదాపు అన్నీ విజయాలు సాధించాయి. శివగారు నాకు `శ్రీమంతుడు`తో మంచి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు `భరత్ అనే నేను` తో విజయం అందించారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా రిలీజ్ కు పది రోజులు ముందు చాలా టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ తీర్చుకోవడానకి ప్రతీరోజు శివగారికి ఫోన్ చేసి మాట్లాడేవాడిని. ఆయన బిజీలో ఆయన ఉండేవారు. మరీ ఎక్కువ విసిగించకూడదని దేవి శ్రీ ప్రసాద్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా రిలాక్స్ గా అనిపించేది. దేవి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. మంచి స్టోరీ టెల్లర్ కూడా. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. నటీనటులు, సాకేతిక నిపుణులు అంతా మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ సక్సెస్ వచ్చింది. నిర్మాత దానయ్యగారు చాలా పాజిటివ్ పర్సన్. సినిమా గురించి మాట్లాడితే ‘మనం హిట్ కొడుతున్నాం. అంతే సర్! అందులో డౌట్ లేదు’ అనే వారు. ఆ మాటలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన నిర్మాత అయిపోయారు. చివరిగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అని అన్నారు.
చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ,` నా ఆలోచనని మంచి మనసుతో మహేష్ గారు సినిమా చేశారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ఇమేజ్ తోనే సినిమాకు అంత హైప్ వచ్చింది. ఏడాది పాటు సినిమా కోసం కష్టపడ్డాం. ఆ కష్టమంతా సక్సెస్ తో దూది పింజెలా ఎగిరిపోయింది. అందుకు తెలుగు రాష్ర్టాల ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా ఎక్కువ రోజులు పనిచేశాం. సినిమాకు ఖర్చు కూడా ఎక్కువే అయింది. రోజు షూట్ పూర్తిచేసుకుని ఇంటికెళ్తుంటే దానయ్యగారే గుర్తొచ్చేవారు. ఆ రోజు ఆయన నమ్మకం నిలబెట్టాను. నా కథను నాకన్నా ఎక్కువగా నా టీమ్ నమ్మింది. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. కెమెరా మెన్లు రవికెచంద్రన్, తిరు గారితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. వాళ్లతో పనిచేసి చాలా విషయాలు తెలుసుకున్నా. ఇక సంగీతం విషయంలో ఏ రోజు టెన్షన్ పడలేదు. అన్నీ దేవి శ్రీ ప్రసాద్ గారు చూసుకునేవారు. ఈ సినిమాకు దేవి నిజంగా ప్రాణం పోసాడు. మిగతా నటీనటులంతా కూడా ఎంత బాగా నటించారో తెలిసిందే. పోసాని కృష్ణ మురళీ గారు నాకు గురువు. తొలిసారి ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనకు డైలాగులు రాయంలంటే భయమేసేది. ‘మీరే రాసుకోండి సార్’ అని చెప్పేవాడిని. కానీ ఆయన నువ్వే రాయాలని మరింత ప్రోత్సహించారు` అని అన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ` జనతా గ్యారేజ్ సినిమా టైమ్ లో ఈ చిత్ర కథ లైన్ కొరటాల గారు చెప్పారు. చాలా గొప్ప కథ…తెరపై చూస్తే ఇంకా బాగుంటుందనిపించింది. శివగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. ఆయనతో నాలుగు సినిమాలకు పనిచేశాను. సిచ్వేషన్ ను బాగా వివరిస్తారు. మిగతా నాలుగు సినిమాలు ఒక ఎత్తైతే..ఈ మూవీ మరో ఎత్తు. ఇదొక స్పెషల్ సినిమా. ఇలాంటి మంచి సినిమా తీసినందకు శివ గారికి హ్యాట్సాఫ్. మహేష్ బాబు గారు ఓ బాధ్యత సినిమా చేశారు. ఇందులో నా పాటల గురించి పొగుడుతూ నాకు ఫోన్ ద్వారా ఓ సందేశం పంపారు. అది చూసి చాలా ఆనందపడ్డా. అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా. కానీ ఆయన అనుమతి లేకుండా చేయడం బాగోదని చేయలేదు. చివరికి మీడియా ఇంటర్వ్యూలో మహేష్ గారే స్వయంగా ఆ మెసెజ్ ఏంటో చెప్పారు. నిజంగా చాలా ఆనందం కల్గింది. చివరిగా సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అని అన్నారు.
హీరోయిన్ కైరా అద్వాణీ మాట్లాడుతూ, ` తెలుగులో నా మొదటి సినిమా ఇది. అదీ మహేష్ బాబు తో నటించడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు
చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ, ` ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కృష్ణ గారు, మహేష్ గారి అభిమానులకు పెద్ద సక్సెస్ ఇస్తానని హామీ ఇచ్చా. అది ఈరోజు నిరూపించుకున్నందకు చాలా సంతోషంగా ఉంది. నా బ్యానర్ గర్వపడే సినిమా ఇది. నా స్నేహితులు, బంధువులు అంతా మంచి సినిమా చేసావని ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటి వరకూ నా ఏ సినిమాకు ఇలాంటి అనుభూతి పొందలేదు. మహేష్-శివగారితో సినిమా చేయడం..ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మహేష్ తో నా సినిమా కల నెరవేరింది. కైరా అద్వాణి మంచి నటి. ప్రతీ సన్నివేశంలో చాలా సహజంగా నటించింది. ప్రస్తుతం మా బ్యానర్లోనే తన రెండవ సినిమా కూడా చేస్తోంది. చివరిగా నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను` అని అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ` శివ గారితో నాలుగు సినిమాలకు పనిచేశాను. కానీ భరత్ అనే నేను నాకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన సినిమా. రెండు రో జుల్లో 100 కోట్లు అంటే చిన్న ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇలాంటి కథలు మరిన్ని రావాలి. అవి మంచి విజయాన్ని సాధించాలి. శివగారు సందర్భాన్ని చాలా బాగా వివరిస్తారు. అందువల్లే మంచి పాటలు రాయగలిగాను. ఆయనతో మరిన్ని సినిమాలకు పనిచేయాలి` అని అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ, ` శంకర్ లాంటి డైరెక్టర్ రాలేరని ఎక్కువగా పీలయ్యేవాడని. భరత్ అనే నేను సినిమాతో అలాంటి డైరెక్టర్ శివ గారు రూపంలో దొరికారు. నాకు ఇక ఆ బాధ తొలగిపోయింది. నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర. మహేష్ బాబు గారు పక్కన నటించడంతో మరింత గుర్తింపు వచ్చింది. ఏలూరులో కృష్ణగారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ల అబ్బాయి మహేష్ తోనే సినిమా చాలా సంతోషాన్నిచ్చింది` అని అన్నారు.