ఓ డాక్టర్ తాగొచ్చి ఆపరేషన్ చేస్తే మీరు చూస్తూ ఉండగలరా?
సమాజంలో బాధ్యతగల ఓ డాక్టర్ తన కామవాంఛను అదుపులో పెట్టుకోవడానికి పబ్లిక్‌లో అందరూ చూస్తుండగానే అండర్వేర్లో ఐస్‌ముక్కలు వేసుకోవడం చూస్తే మీకేమనిపిస్తుంది?
ప్రేమికురాలిని మరచిపోవడానికి మరొక స్త్రీతో ‘ఫిజికల్‌గా హెల్ప్’Û (సెక్స్) చేస్తావా?
అని అడగటంతోపాటు ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఆ హెల్ఫ్ చేయాలనే కండిషన్ పెడితే మీరు సహించగలరా?
ప్రేమలో విఫలమై మద్యానికి, డ్రగ్స్‌కి బానిసై మాటల్లో చెప్పజాలని జగుఫ్సాకరమైన సన్నివేశాలు, ఇబ్బందికరమైన హావభావాలు, బూతులు తిడుతుంటే మీరు చూస్తూ ఊరుకోగలరా?
– సామాజిక కోణంలో ఇలా ప్రశ్నించుకుంటూ పోతే దాదాపు మూడు గంటల సుదీర్ఘ సినిమా మొత్తం ప్రశ్నలమయమైపోతుంది. అదీకూడా సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే అంశాలే కావడం ఇక్కడ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. సమాజం పట్ల ఏ మాత్రం అవగాహన లేకుండా రూపొందిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. మనిషికి, జంతువుకి మధ్య తేడా ఏంటో కూడా తెలియని కనీస ఇంగితం లేకుండా తీసిన సినిమా.
– భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఉన్న దేశం మనది. మన భావాల్ని యదేచ్ఛగా ఏ రూపంలోనైనా చెప్పుకునే వెసులు బాటూ ఉంది. అయితే దానికి కొన్ని పరిమితులు, పద్ధతులున్నాయి. అవేంటో కూడా తెలుసుకోకుండా శృతిమించి చేసిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’.
– ఏ సినిమా ప్రారంభానికైనా ముందు సిగరెట్, మద్యం సేవించి జీవితాలను నాశనం చేసుకోకండి అంటూ ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం కోసం ఓ ప్రభుత్వ ప్రకటన కనీసం మూడుసార్లు వస్తుంది. ఈ సినిమా ప్రారంభంలోనూ ఆ ప్రకటన వచ్చింది. దీని తర్వాత అసలు సినిమాలోకి వెళ్లేముందు సిగరెట్, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్‌కి దారి తీస్తుంది అంటూ హీరో వాయిస్‌తోనే చెప్పించారు. తీరా సినిమాలో చూస్తే, దాదాపు 95 శాతం మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ వాడుతున్న హీరో సన్నివేశాలే కనిపిస్తాయి. ధూమపానానికి, మద్యానికి బానిసలవ్వద్దంటూ ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత లక్షల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసినట్టయ్యింది. అంతేకాదు ఈమధ్య కాలంలో డ్రగ్స్ కేసు ఓ పెను తుపానే సృష్టించింది. ఇటువంటి తరుణంలో సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ని వీటితో నింపేయటం అత్యంత విచారకరం. ఈ విషయాలపై దర్శక, నిర్మాతలకు ఏమాత్రం అవగాహన, బాధ్యత లేకపోవడం మరింత బాధాకరం.
– ఇదంతా ఓ ఎత్తయితే, ఇందులో మహిళలను కించపరిచే రీతిలో అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలున్నప్పటికీ దర్శకుడు తెలివిగా ఓ సందర్భంలో స్త్రీలను అత్యంత పవిత్రంగా చూడాలనే నీతులనూ హీరోతో చెప్పిస్తాడు. ఇదెంత వరకు సమంజసం?. ప్రేమికురాలిని మరచిపోవడానికి మరొక స్త్రీతో ఫిజికల్‌గా హెల్ఫ్ (సెక్స్) చేస్తావా అని అడగటంతోపాటు ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఆ హెల్ఫ్ చేయాలనే కండిషన్ పెట్టడంలోనే స్త్రీ పట్ల దర్శకుడికి ఇసుమంతైనా గౌరవం లేదని అర్థమవుతోంది. ఓ పక్క బోల్డ్ ఉమనైజర్గానే చిత్రీకరిస్తూ మరో పక్క ఓ గొప్పవ్యక్తిగా కథానాయకుడిని చిత్రీకరించే ప్రయత్నంలోనూ స్త్రీలను కేవలం వస్తువుగానే చూసి దర్శకుడి వైనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదగ్గది కాదు. 71 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న తరుణంలో ఇంకా స్త్రీలను వస్తువుగా చూడటం ఎంత వరకు న్యాయం? ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలను గౌరవించని సినిమా ఇది.
– మానవ సంబంధాలను దెబ్బ తీసే సినిమా కూడా. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడే కాదు మద్యానికి, డ్రగ్స్‌కి బానిసై తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయే కథానాయకుడి తీరు చూస్తే, మానవ సంబంధాల విషయంలోనూ దర్శక, నిర్మాతలకు బాధ్యత లేదనిపిస్తుంది. పాశ్చాత్య ధోరణికి ప్రయారిటీ ఇచ్చిన దర్శకుడు మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని పట్టించుకోకపోవడం గర్హనీయం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇందులో ఉన్న లెక్కలేనన్ని లిప్‌లాక్ ముద్దులు. లిప్‌లాక్ చేసే నాయకానాయికల పోస్టర్ కూడా సినిమా విడుదలకు ముందు వివాదానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్‌తోపాటు విడుదల చేసిన ట్రైలర్స్, టీజర్స్ సైతం యువతరాన్ని టార్గెట్ చేసినవే అని చెప్పడంలో నిస్సందేహం లేదు. అందుకే ఈ చిత్రాన్ని యూత్ అధిక సంఖ్యలో చూస్తున్నారు. కాలేజీలకు, స్కూళ్ళకు సైతం బంక్ కొట్టి మరీ చూస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం ‘శివ’ చిత్రాన్ని చూసి యువత వెర్రిగా సైకిల్ చైన్లు, రాడ్లతో కొట్టుకున్న ఎన్నో సందర్భాలను మనం చూశాం. సరిగ్గా ఆ కేటగిరికి చెందిన సినిమానే ఇది. కాకపోతే యువతపై మరొక రీతిలో ప్రభావం చూపే సినిమా.
– కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ యువకుడు ప్రేమలో విఫలమై డిప్రెషన్లోకి వెళ్తే ఇలాగే చేస్తాడు కదా అని సమర్థించే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ దానికి ఓ పరిమితి ఉంటుంది. ఓ హద్దూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో ప్రవర్తించే తీరు, అతని హావభావాలు, పనులన్ని అతిగా ఉంటాయి. కన్నవాళ్లని, స్నేహితులను కూడా బూతులతో తిట్టేస్తే అది చూసి మనం గర్వపడాలా? ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
– ఇదిలా ఉంటే, ప్రాణదాతగా అభివర్ణించే డాక్టర్ ఏవైతే చేయకూడదో అవన్నీ ఈ చిత్రంలో డాక్టరైన హీరో పాత్రతో దర్శకుడు చేయించాడు. అదెంత పరాకాష్టకు తీసుకొచ్చాడంటే ఫుల్‌గా తాగి రోగికి ఆపరేషన్ చేసేంత వరకు తీస్కెళ్ళాడు. మరి ఈ రకంగా చూస్తే దర్శకుడిని మనం ఏమని ప్రశ్నించాలి?. సినిమా కాబట్టి ఏదైనా చూపించవచ్చు, ఏదైనా మాట్లాడించవచ్చనే దర్శకుడి దృక్పథం సమంజసమేనా?. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న డాక్టర్ని ఇలా చూపించడం ఎంతవరకు సబబు?.. ఈ ధోరణిలోనూ దర్శకుడికి సమాజం పట్ల అవగాహన కాదు అసలు గౌరవమే లేదనిపిస్తుంది.
– బాధ్యతాయుతమైన పోలీస్, డాక్టర్, లాయర్ వంటి తదితరులపై ఇప్పటికీ ఎన్నో సినిమాలొచ్చారు. వాటిల్లోనూ మనం చూడకూడనివి చూశాం. అయితే వాటిల్లో ఓ పరిమితిలో మాత్రమే ఉంటాయి. కొన్నింటిలో అత్యవసరమైతే తప్ప చూపించే సాహసం, ప్రయత్నం చేయలేదు. వాటితోపోలిస్తే ఈ సినిమాలో అతి విశృంఖలంగా ఆనందతాండవం చేసింది.
– సమాజం పట్ల బాధ్యత, అవగాహన, గౌరవం లేని దర్శక, నిర్మాతలు తీసిన సినిమా ఇది. ముఖ్యంగా స్త్రీలను గౌరవించని సినిమా. మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే సినిమా. అన్నింటికి మించి యువతరం మనసుల్లో, గుండెల్లో బలంగా విషబీజం నాటే సినిమా…ఓ సినిమా హిట్ అయినంత మాత్రానా, కలెక్షన్ల వర్షం కురిపించినంత మాత్రానా, పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసినంత మాత్రానా.. ప్రజలకు నష్టం కలిగించే ఏ సినిమా అయినా సరే అది ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదగ్గ సినిమా కాదు. ఇది ‘అర్జున్‌రెడ్డి’కి కూడా వర్తిస్తుంది.
– అయినప్పటికీ ఈ సినిమాకి జేజేలు కొట్టిన ప్రేక్షకులు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులు..
స్కూళ్లు, కాలేజీలకు బంక్ కొట్టి మరీ వెర్రిగా చూస్తున్న యువతరం ప్రేక్షకులందరూ ఓసారి ఎలాంటి సినిమా చూశాం అని మనసుని ప్రశ్నించండి. సమాధానం దొరికే క్రమంలో మీ మనసు తడబడితే సమాజానికి నష్టం కలిగించే సినిమా అని గుర్తించండి. ఆ సమాజంలో మీరూ ఉన్నారని గమనించండి. అలాగే సమాజం పట్ల కనీస అవగాహన ఉండాలని ఈ చిత్ర దర్శక, నిర్మాతలూ ఇకనైనా తెలుసుకోవాలి.
– రెడ్డి హనుమంతరావు