కమెడీయన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత సునీల్‌ని పలు ఫ్లాపులు పలకరిస్తుండడంతో కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా ‘ఉంగరాల రాంబాబు’ చిత్రంతో పలకరించిన సునీల్ ఈ చిత్రంతోను నిరాశ పరచాడు.స్టార్ కామేడియన్ గా రాణిస్తున్న సునీల్ బంగారం లాంటి కెరీర్ ని వదులుకుని హీరో మోజులో పడి సక్సెస్ లేక రెండిటికీ చెడ్డ రేవడిలా అయిపోయాడని అంతా అభిప్రాయం పడ్డారు . మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారితే అతనికి అన్ని విధాలా లాభమని శ్రేయోభిలాషులు చాలా కాలం గా సలహా ఇస్తున్నారు . అయితే సునీల్ కి తాజా ఫ్లాప్ ‘ఉంగరాల రాంబాబు’ తో జ్ఞానోదయం అయినట్లుంది . స్పృహలోకొచ్చిన సునీల్ త్వరలో తాను మళ్లీ కమెడీయన్‌గా అలరిస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం అతని చేతిలో రెండు ప్రాజెక్టులు ఉండగా, అందులో ఒకటి చిరు ప్రాజెక్ట్ ఉందని ఫిలిం నగర్ సమాచారం. చిరు 150వ చిత్రంలోనే సునీల్ చేయాల్సి ఉన్నప్పటికి , కొన్ని కారణాల వలన అది కుదరలేదు . కాని ఇప్పుడు ‘సైరా’ చిత్రంలో తప్పక చేస్తానంటున్నాడు ఈ మెగా అభిమాని.
మరి ‘ఉయ్యాలవాడ’ ప్రాజెక్ట్ చాలా సీరియస్ ప్రాజెక్ట్. ఇందులో సునీల్ ఏ పాత్ర చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ రెండో వారంలో ‘సైరా’ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. చిరు 151వ మూవీగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రాంచరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సైరా కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నేతృత్వంలో భారీ సెట్‌ను కూడా వేశారట. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్బచ్చన్తోపాటు సుదీప్, జగపతిబాబు, రఘుబాబు, నాజర్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.