సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్ లుక్

 ‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టారస్ సినీకార్ప్  మరియు సుధాకర్ ఇంపెక్స్  ఐపీఎల్  పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్నది. చిత్ర నిర్మాతలలో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూలై 1 న చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు  చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. “సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ‘సుబ్రహ్మణ్యపురం’. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. దయ్యానికి ఆగ్రహమొస్తే దేవుడ్ని ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే చక్కని కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హీరో సుమంత్ ఈ చిత్రంలో నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని హీరో.. తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఉంటుంది.
జూన్ 18 నుంచి జూలై 1 వరకు జరిగిన రెండవ షెడ్యూల్ లో యానాం, కాకినాడ, అమలాపురంలోని సుందరమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాము. జూలై, ఆగష్టు లలో జరిగే షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. తప్పకుండా సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం వుంది” అని తెలిపారు.
నటీనటులు:
సుమంత్, ఈషా రెబ్బ, సురేష్, తనికెళ్ళ భరణి, జోష్ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్, టిఎన్ఆర్ తదితరులు.
సాంకేతిక వర్గం:
కెమెరా : ఆర్కే ప్రతాప్
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ : లక్ష్మీ సిందుజ
స్టైలిస్ట్ : సుష్మ
ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ
మూల కధ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
రచనా సహకారం : నాగ మురళి నామాల
చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు : బీరం సుధాకర్ రెడ్డి, ధీరజ్ బొగ్గరం