కమర్షియాలిటీ పేరుతో కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి అటూ -ఇటూ కాని సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ సమయంలో ….రొటీన్‌కు భిన్నంగా, స్వచ్ఛమైన ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న ఈ ఫీల్ గుడ్ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క, దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని అభినందించాలి. విడుదలైన మొదటిఆటకే అందరిచేతా ‘మంచి చిత్రం’ అనిపించుకుంది ‘మల్లీరావా’. అయితే ప్రసంశ లందుకున్న సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ సాధించని విషయం మనకు తెలిసిందే. అటువంటి అనుమానమే ఈ చిత్రం విషయం లోనూ కలిగింది . అయితే మన ప్రేక్షకులు మరోసారి మంచి సినిమాను తమ మనసులకద్దుకున్నారు. విజయవంతం చేసారు. ఇప్పుడు ‘మల్లీరావా’ విజయదశ ను దాటి ఘన విజయదిశగా సాగుతోంది . క్రమంగా ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది….
శేఖర్ కమ్ముల, గౌతమ్ మీనన్ ల తరహాలో ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రమిది. మూడు భిన్న కాలాల్లో సాగే కథ,కధనంలో వైవిధ్యాన్ని దర్శకుడు గౌతమ్ చక్కగా చూపించారు. కథలో అంత కొత్తదనం లేకపోయినా వినోదానికి భావోద్వేగాలను మిళితం చేస్తూ, సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ, ఆసక్తికరంగా సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్అయ్యాడు.
కార్తీక్ పాత్రకు సుమంత్ పూర్తి న్యాయం చేశారు. చాలా రోజుల తర్వాత గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. భావోద్వేగ ప్రధాన సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనను కనబరిచారు. సుమంత్, ఆకాంక్షసింగ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఒక మంచి రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేసాం !
‘మళ్ళీ రావా’ చిత్ర యూనిట్ నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్ కార్యక్రమం లో హీరో సుమంత్ మాట్లాడుతూ…. ‘మళ్ళీ రావా’ సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. స్టోరీ బాగా నచ్చింది కనుకే నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకమే ఇంతటి మంచి ఫలితాన్ని అందించింది. గౌతమ్ లాంటి ఒక మంచి రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేశామని గర్వంగా ఉంది. నిర్మాత రాహుల్ కు ఎలాంటి అనుభవం లేకున్నా సక్సెస్ ను సాధించి చూపించాడు. ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషిస్తున్నా అన్నారు.
ఈ సినిమాను ఎంత నమ్మామో అంత కంటే మంచి ఫలితం దక్కినందుకు హ్యాపీగా ఉన్నాం… ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరు తమ ఓన్ బ్యానర్ లా ఫీల్ అయ్యి కష్టపడి పని చేశారు.. అందుకే అందరికీ ఆడియన్స్ నుంచి సమానమైన మంచి పేరు వస్తోంది. అందుకు గర్వం గా ఫీల్ అవుతున్నా…అని అన్నారు నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ .